మాక్కావాలంటే మాక్కావాలంటూ .. యాట తలకాయ కోసం లొల్లి

పర్వతగిరి, వెలుగు : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ లో యాట (మేక, గొర్రె) తలకాయ కోసం రెండు గ్రామాలకు చెందిన వ్యక్తులు గొడవ పెట్టుకుని ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్​1వ తేదీన మేక తలకాయలు కొనేందుకు కల్లెడకు చెందిన కొందరు, పెద్దతండాకు చెందిన మరికొందరు అన్నారం దర్గా దగ్గరకు వచ్చారు. కందూరు చేసేవాళ్లు  దేవుడికి మొక్కు అప్పజెప్పేందుకు  ఓ మేక తలకాయను తెచ్చారు. 

దీని కోసం రెండు ఊళ్లకు చెందిన వ్యక్తులు తమకు కావాలంటే తమకు కావాలంటూ పోటీపడ్డారు. ఒకరినొకరు గల్లాలు పట్టుకున్నారు. ఈ క్రమంలో కల్లెడకు చెందిన ఓ వ్యక్తి అక్కడే ఉన్న కత్తి తీసుకుని తండాకు చెందిన వ్యక్తులపై  దాడికి ప్రయత్నించాడు. కల్లెడకు చెందిన మరో వ్యక్తి కత్తిని పట్టుకున్న వ్యక్తిని ఆపేందుకు చూడగా ఆ కత్తి అతడి చెయ్యికి  తాకి గాయమైంది. అక్కడే ఉన్న తండాకు చెందిన సంతోష్​ ఆపేందుకు ప్రయత్నించగా అతడిని  కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై ఇరు వర్గాలు పర్వతగిరి  పీఎస్​లో ఫిర్యాదు చేశాయి. దర్యాప్తు  చేస్తున్నామని ఎస్సై వీరభద్ర రావు తెలిపారు.