న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. మార్నింగ్‌వాక్‌కు వెళ్లిన ఓ వ్యాపారవేత్తపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అతడు స్పాట్లోనే మృతిచెందాడు. ఢిల్లీలోని షాహదారా జిల్లా ఫార్ష్ బజార్ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సునీల్ జైన్(57) అనే వ్యాపారవేత్త యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మార్నింగ్ వాక్ ముగించుకుని స్నేహితుడితో కలిసి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో ఇద్దరు దుండగులు అతన్ని ఫాలో అవుతూ వచ్చి.. అతని ఫోన్ పడిపోయిందని చెప్పారు. దీంతో అతడు బండి ఆపగా నిందితుల్లో ఒకరు అతని పేరు అడిగారు. అతడు పేరు చెప్పగానే నిందితులు ఇద్దరు వెంటనే అతనిపై ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. తనపై కాల్పులు జరపొద్దని జైన్ నిందితులను వేడుకున్నా వారు వినలేదు. క్షణాల్లోనే అంతా జరిగిపోయింది.
మృతుడు సునీల్ జైన్ దేశ రాజధానిలోని కృష్ణా నగర్లో ఉంటాడని, అతనికి స్టీల్సామాన్ల వ్యాపారం ఉందని పోలీసులు తెలిపారు. కాగా, జైన్‌కు ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. జైన్ తన స్నేహితులతో కలిసి ప్రతిరోజు మార్నింగ్‌వాక్‌కు వెళ్తాడని తెలిసింది. క్రైమ్ టీమ్ పోలీసులు స్పాట్‌కు చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ షాహదారా తెలిపారు.
టాయిలెట్ 'ఫ్లష్' నొక్కలేదని ఒకరి హత్య..
శుక్రవారం రాత్రి గోవింద్‌పురి ప్రాంతంలో టాయిలెట్‌లో 'ఫ్లష్' నొక్కలేదని పొరుగింటి వ్యక్తిపై ఒకరు కత్తితో దాడి చేశారు. సుధీర్ అనే వ్యక్తి కామన్ టాయిలెట్‌లో ఫ్లష్ నొక్కలేదు. దీంతో బిఖమ్ సింగ్ అనే వ్యక్తి సుధీర్‌తో పాటు మరో ఇద్దరితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం బిఖమ్ సింగ్ తన వంటగదిలోని కత్తి తీసుకొచ్చి దాడి చేయడంతో సుధీర్మృతి చెందాడు.
గ్యాంగ్ స్టర్ల కంట్రోల్లో ఢిల్లీ: కేజ్రీవాల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల బిజీలో ఉండడంతో ఢిల్లీని గ్యాంగ్స్టర్లు కంట్రోల్ చేస్తున్నారంటూ కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీలో ఒకేరోజు రెండు హత్యలు జరిగిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీలో శాంతి భద్రతల బాధ్యత అమిత్ షాదే. అయితే, ఆయన ఎన్నికల బిజీలో ఉన్నారు. ఢిల్లీని గ్యాంగ్స్టర్లు నియంత్రిస్తున్నారు. శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మహిళలకు భద్రత లేదు” అని కేజ్రీవాల్ ఆరోపించారు.