![తిరుమలలో గరుడసేవ ....ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాలు రద్దు](https://static.v6velugu.com/uploads/2023/09/Two-Wheelers-Restriction-on-Tirumala-Ghat-Roads_ZvPFJKDzGN.jpg)
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 22న గరుడసేవనాడు విశేషంగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. పవిత్రమైన గరుడ సేవను నిర్వహించేందుకు టీటీడీ అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. శక్తివంతమైన గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తారు.
గరుడ సేవ సందర్భంగా ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి సెప్టెంబరు 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనాలను పార్క్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పించింది.
ప్రతి ఏడాదీ తిరుమల బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవను ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు గరుడ పూజ చేస్తారని ప్రాశస్త్యం.
తిరుమలలో గరుడ సేవ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.