పాలమూరు పార్లమెంట్​ పరిధిలో..ఇద్దరు మహిళలు, ఇద్దరు బీసీలు

పాలమూరు పార్లమెంట్​ పరిధిలో..ఇద్దరు మహిళలు, ఇద్దరు బీసీలు
  • అసమ్మతి బెడద లేకుండా కాంగ్రెస్​ సెకండ్​ లిస్ట్​
  • పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న హైకమాండ్

మహబూబ్​నగర్, వెలుగు : కాంగ్రెస్​ హైకమాండ్  మహబూబ్​నగర్​ పార్లమెంట్​ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో క్యాండిడేట్లను విడతల వారీగా ఫైనల్​ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో క్యాండిడేట్లను ఫైనల్​ చేసే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. లీడర్ల మధ్య అసమ్మతి లేకుండా చూసి అభ్యర్థులను ప్రకటించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

ఫస్ట్​ లిస్ట్​లో పాలమూరు పార్లమెంట్​ పరిధిలో రెండు స్థానాలు ప్రకటించగా, ఆ రెండు వికారాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నాయి. అయితే, మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాల్లో ఒక్క క్యాండిడేట్​ను కూడా ఫైనల్​ చేయలేదు. దీంతో ఈ రెండు జిల్లాల్లో టికెట్ల కోసం పోటీ పడుతున్న ఆశావహుల్లో ఫైనల్​గా ఎవరి పేర్లు బయటకు వస్తాయనే దానిపై టెన్షన్​ నెలకొంది.

అసమ్మతి లేకుండా చూడాలని..

మహబూబ్​నగర్​ పార్లమెంట్​ పరిధిలో టికెట్లు ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. ఒక్కో సెగ్మెంట్​లో ముగ్గురు నుంచి ఐదారుగురు పోటీ పడుతున్నారు. ఒక్క మక్తల్​ అసెంబ్లీలోనే ఆరుగురు టికెట్లు ఆశిస్తుండగా, దేవరకద్రలో ముగ్గురు, పాలమూరులో నలుగురు పోటీ పడుతున్నారు. దీంతో ఎవరి పేర్లు కన్ఫాం చేసినా అసమ్మతి రగిలే అవకాశం ఉండడంతో హైకమాండ్​ ఫస్ట్​ లిస్టులో ఈ పార్లమెంట్​ పరిధిలో క్యాండిడేట్ల పేర్లను ప్రకటించలేదని తెలిసింది. అసమ్మతి నెలకొంటే కొందరు రెబల్స్​గా పోటీకి దిగే చాన్స్​ ఉండొచ్చనే ముందస్తు సమాచారంతో హైకమాండ్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దీనికితోడు టికెట్లు రాని ఆశావహులు పక్క పార్టీలకు వెళ్లే చాన్స్​ ఉండడం, గత ఎన్నికల్లో కొన్ని సెగ్మెంట్లలో జరిగిన మాదిరిగానే ఆశావహులు కాంగ్రెస్​లోనే ఉంటూ పక్క పార్టీల క్యాండిడేట్లకు సహకరించేలా ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయనే సర్వే రిపోర్టులు రావడంతో హైకమాండ్​ ప్లాన్​ ప్రకారం విడతల వారీగా మహబూబ్​నగర్​ పార్లమెంట్​ పరిధిలో క్యాండిడేట్లను ప్రకటించేందుకు నిర్ణయించినట్లు తెలిసింది.

మహిళా క్యాండిడేట్​కూ అవకాశం..

కాంగ్రెస్​ రిలీజ్​ చేసిన ఫస్ట్​ లిస్ట్​లో నాగర్​కర్నూల్​ పార్లమెంట్​ పరిధిలోని గద్వాల అసెంబ్లీ స్థానం నుంచి సరిత తిరుపతయ్యను బరిలోకి దింపారు. పాలమూరు పార్లమెంట్​లో కూడా ఒక మహిళకు టికెట్‌‌ ఇచ్చే అవకాశాలున్నాయి. మక్తల్  నుంచి ఇప్పటికే సీతా దయాకర్​రెడ్డితో పాటు దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి మనుమరాలు చిట్టెం పర్ణికారెడ్డి టికెట్లు ఆశిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి టికెట్​ ఇచ్చే విషయంపై పార్టీ హైకమాండ్​ ఆలోచన చేస్తోంది.

ఇటీవల హైకమాండ్  రెండు పక్క పక్క నియోజకవర్గాల్లో వీరిద్దరిపై సర్వే నిర్వహించగా.. ఆ రిపోర్ట్​ ఇద్దరికీ అనుకూలంగా వస్తే ఇద్దరికీ టికెట్లు ఇచ్చే చాన్స్​ కూడా ఉన్నట్లు సమాచారం. పక్క పక్క నియోజకవర్గాల్లోనే పోటీ చేసే అవకాశం ఉండడంతో ఇద్దరికీ ప్లస్​ అవుతుందనే చర్చ నడుస్తోంది.

మరో ఇద్దరు బీసీలకూ చాన్స్​..

మహబూబ్​నగర్​ పార్లమెంట్​ పరిధిలో అత్యధికంగా బీసీ జనాభా ఉంది. ఇటీవల ఈసీ ప్రకటించిన ఓటర్ల లిస్ట్  ఆధారంగా ఈ పార్లమెంట్​లోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో 16,06,745 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 53 శాతం అంటే ఎనిమిదిన్నర లక్షల మంది ఓటర్లు బీసీలే ఉండటం విశేషం. దీంతో కాంగ్రెస్​ హైకమాండ్​ ఈ పార్లమెంట్​ పరిధిలో మరో రెండు స్థానాలను బీసీలకు కేటాయించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, మహబూబ్​నగర్​లో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండగా, ఈ నాలుగింటిలో రెండు స్థానాల నుంచి బీసీ లీడర్లను బరిలో దింపడంపై దృష్టి పెట్టినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.