పొలంలో పని చేసుకుంటున్న కూలీలపై బోల్తా పడిన లారీ

పొలంలో పని చేసుకుంటున్న కూలీలపై బోల్తా పడిన లారీ
  • పత్తి గింజల బస్తాలు మీద పడడంతో ఇద్దరు మహిళలు మృతి
  • జయశంకర్​ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో ఘటన

మొగుళ్లపల్లి, వెలుగు: పొలంలో పని చేసుకుంటున్న మహిళా కూలీలపై లారీ బోల్తా పడడంతో ఇద్దరు మహిళలు బస్తాల కింద నలిగి చనిపోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్  భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం శాంతినగర్  సమీపంలోని జిన్నింగ్  మిల్లు నుంచి పెద్దపల్లికి పత్తి గింజల లోడుతో వెళ్తున్న లారీ వేగంగా వస్తూ మండలంలోని రామకృష్ణాపూర్  వద్ద పొలంలో బోల్తా పడింది.

లారీలోని బస్తాలు అక్కడే పని చేసుకుంటున్న మహిళా కూలీలపై పడ్డాయి. బస్తాలు మీద పడి ఊపిరి ఆడకపోవడంతో మోకిడి సంధ్య(30), మోకిడి పూలమ్మ(45) అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో డెడ్ బాడీలను చిట్యాల సివిల్  హాస్పిటల్ కు తరలించారు. అప్పటి వరకు తమతో ఉన్న సంధ్య, పూలమ్మలు విగతజీవులుగా మిగలడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.