- బట్టలు ఆరేస్తూ ఒకరు.. వాటర్ హీటర్ ఆన్‌లో ఉండగా నీళ్లలో చేయి పెట్టి మరొకరు..
- గద్వాల జిల్లాలో ఘటనలు
కేటిదొడ్డి, వెలుగు : గద్వాల జిల్లాలో కరెంట్ షాక్‌తో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలు చనిపోయారు. కేటిదొడ్డి మండలం నందిన్నె, పాతపాలెం గ్రామాల్లో సోమవారం ఈ ఘటనలు జరిగాయి. నందిన్నె గ్రామానికి చెందిన కురువ భూలక్ష్మి(40) ఉదయం బట్ట లు ఉతికి వాటిని ఇనుప వైరుపై ఆరేస్తోంది. ఈ వైరుకు ఆనుకుని ఉన్న ఓ రేకుకు సర్వీస్ వైరు తాకడంతో కరెంట్సరఫరా జరిగింది. దీంతో భూలక్ష్మికి షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయింది.
మృతురాలికి భర్త గోకరప్ప, ముగ్గురు కొడుకులున్నారు. అలాగే పాతపాలెం గ్రామానికి చెందిన దౌలత్ బీ(50) బకెట్లో నీళ్లు నింపి అందులో వాటర్ హీటర్ పెట్టింది. నీళ్లు వేడయ్యాయా లేదా అన్నది తెలుసుకోవడానికి నీళ్లలో చేయి పెట్టడంతో షాక్ తగిలి అక్కడికక్కడే కన్నుమూసింది. దౌలత్ బీకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు, భర్త ఇస్మాయిల్ ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.