తెలంగాణ రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న ఇద్దరు మహిళలు మొన్నటి వరకు నేషనల్మీడియా దృష్టిని ఆకర్షించారు. వారిలో ఒకరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల. కొత్త రాజకీయ పార్టీతో తెలంగాణలో పట్టు సాధించాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. మరో మహిళ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత. తెలంగాణ ఉద్యమంతోపాటు, రాష్ట్ర ఏర్పాటు తర్వాత జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. గతంలో నిజామాబాద్ మాజీ ఎంపీగా పని చేసిన ఆమె, ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. తమ రాజకీయ లక్ష్యాలను సాధించడంలో దూకుడుగా ఉన్న ఈ ఇద్దరు సీఎంల బిడ్డలు ఇటీవల నేషనల్ మీడియాలో ఫోకస్అయ్యారు.
కొత్తగా పార్టీ పెట్టి..
తెలంగాణలో మొన్నటి వరకు వార్తల్లో నిలిచిన మరో మహిళా నాయకురాలు షర్మిల. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు కావడంతోపాటు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి కూడా. ఆమె తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టి రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో విభేదించే.., తల్లి మద్దతుతో ఆమె తెలంగాణపై దృష్టి పెట్టారనే పుకార్లు అప్పట్లో వచ్చాయి. షర్మిల, సోదరుడితో కలిసి సుదీర్ఘ పాదయాత్రలు చేసి ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. వైఎస్సార్టీపీ ద్వారా తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలనే ఉద్దేశంతో ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె తెలంగాణలో 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ప్రజల దృష్టిని ఆకర్షించగలిగారు. అధికార టీఆర్ఎస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు రైతు రుణమాఫీ చేయలేదని, ప్రతి పేద కుటుంబానికి డబుల్బెడ్రూమ్ఇల్లు ఇవ్వలేదని, ఎమ్మెల్యేల అవినీతి గురించి ప్రశ్నిస్తే.. కేసీఆర్‌కు భయమెందుకు? అని ప్రతీచోట నిలదీస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు మాత్రం టీఆర్ఎస్ను దెబ్బకొట్టడానికి బీజేపీ వదిలిన ‘బాణం’ అని ఆమెను విమర్శిస్తున్నారు. స్థానికేతర నేతలను తెలంగాణ ప్రజలు నమ్మరని తేల్చి చెబుతున్నారు.
ప్రత్యేక స్థానం ఏర్పర్చుకుంటారా?
ఇటీవల పాదయాత్ర చేస్తున్న ఆమె కాన్వాయ్‌పై దాడి జరిగింది. పోలీసులు ఆమె పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదు. దాన్ని ఆమె ఖండిస్తూ ప్రగతి భవన్ ముట్టడి కోసం వెళ్లారు. పంజాగుట్ట వద్ద ఆమె కారును ఆపిన పోలీసులు.. టోయింగ్ మిషన్ ద్వారా ఆమె వాహనాన్ని లేపి తీసుకువెళ్లడం నేషనల్మీడియాలో బాగా ఫోకస్ అయింది. ‘‘ప్రజా ప్రయోజనాల కోసం పాదయాత్ర చేపట్టాను. మా గ్రాఫ్ పెరుగుతోంది కాబట్టి, మేము కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా మారుతున్నాము కాబట్టే, మా పాదయాత్రను అడ్డుకొని దాడులకు పాల్పడుతున్నారు. నాకు వ్యక్తిగత ఎజెండా లేదు. ఎవరిపై వ్యక్తిగతంగా దాడి చేయడం లేదు. అవినీతికి పాల్పడిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేను చెప్పిన ఇతరులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఇది ప్రజాభిప్రాయం తప్ప.. నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేసి, స్వార్థపరులను చేరదీశారు”అని షర్మిల్ హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ప్రస్తావించారు. తాను పక్కా హైదరాబాదీ అని, తన పెండ్లి ఇక్కడే జరిగిందని, పిల్లలు ఇక్కడే పుట్టారని, తన గతం, వర్తమానం ఇక్కడ ఉన్నాయని ఆమె తేల్చి చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు అవినీతిని ఎత్తిచూపిన ఏకైక పార్టీ తమదేననేది షర్మిల ధీమా. పురుషాధిక్య రాజకీయాల్లో సందర్భాలు వేర్వేరు అయినప్పటికీ ఇద్దరు మహిళా నేతలు రాజకీయంగా నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించారు. అయితే ఆమె తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఏ మేరకు పొందగలరు? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు ఆమెకు ఏ మేరకు మద్దతు పలుకనున్నారో ఇప్పుడే చెప్పలేం. మరి రానున్న రోజుల్లో ఈ ఇద్దరు సీఎంల బిడ్డలు రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటారో లేదో చూడాలి మరి!
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పాత్ర ఉన్నదనే అభియోగాలతో కేసీఆర్ కుమార్తె కవిత జాతీయ వార్తల్లో నిలిచారు. లిక్కర్‌స్కామ్‌లో తన పాత్ర లేదని ఆమె తీవ్రంగా ఖండించినప్పటికీ, సీబీఐ ఆమెకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160 కింద నోటీసు పంపింది. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఆమెను విచారించింది. మద్యం కుంభకోణంలో వ్యాపారవేత్త అమిత్ అరోరాపై ఢిల్లీ కోర్టులో ఈడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో ఆమె పేరు ఉన్నది. విజయ్ నాయర్ అనే వ్యాపారవేత్త ‘సదరన్ గ్రూప్’ నుంచి రూ.100 కోట్లు అందుకున్నారని ఆరోపణ, ఇందులో కవిత, శరత్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి పేర్లు ఉన్నాయి. వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లిక్కర్ స్కామ్‌కేసులో కవిత పేరు ఉండటంపై బీజేపీకి, అధికార బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను వేధించడం, వారి పరువు తీయడమే లక్ష్యంగా రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్న కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోనూ మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కవిత స్వయాన సీఎం కూతురు కావడం, ఆమె పేరును ఈడీ ప్రస్తావించడంతో ఆమె జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారు. అది ప్రత్యర్థుల విమర్శల దాడి మరింత పెరగడానికి దారి తీసింది. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని కవిత స్పష్టం చేశారు. మరి ఆమె సీబీఐ,-ఈడీ వల నుంచి క్షేమంగా బయటపడుతుందా లేదా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు వేదికలపై బహిరంగంగా విమర్శిస్తున్నట్లు జైలుకు వెళ్తుందా అనేది వేచి చూడాల్సిందే!
- సీఆర్. గౌరీ శంకర్,సీనియర్ జర్నలిస్ట్