- కల్లు తాగేందుకు వెళ్లి దుందుభి నదిలో చిక్కుకున్రు
- 6 గంటలు శ్రమించి కాపాడిన ఆఫీసర్లు
మిడ్జిల్, వెలుగు : కల్లు తాగేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలు దుందుభి నదిలో చిక్కుకోగా, రెస్క్యూ టీమ్తీవ్రంగా శ్రమించి సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం చిలువేరు గ్రామానికి చెందిన నీలమ్మ, సుగుణమ్మ సోమవారం మధ్యాహ్నం కల్లు తాగేందుకు పక్క గ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దుందుభి నది దాటేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దాంతో ఇద్దరు మహిళలు నదిలోని ముళ్ల చెట్లను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.
అటుగా వెళ్తున్న స్థానికులు ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్, రెస్క్యూ టీమ్స్ మహిళలు ఉన్నచోటికి వెళ్లేందుకు ప్రయత్నించగా కదరలేదు. నీటి ఉద్ధృతి పెరగడంతో మహబూబ్ నగర్ నుంచి బోట్లను తెప్పించారు. అయితే అవి ఎంతకీ స్టార్ట్కాకపోవడంతో గ్రామస్తులు ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు బోట్లు స్టార్ట్ అవడంతో రెస్క్యూ టీం మహిళలను సేఫ్గా బయటికి తీసుకొచ్చింది. సహాయక చర్యల్లో తహసీల్దార్ రాజు నాయక్, సీఐ జములప్ప, ఎస్సై శివ నాగేశ్వర నాయుడు పాల్గొన్నారు.
-