బడంగ్ పేట, వెలుగు: ఇంటిముందు ఆడుకుంటున్న రెండేండ్ల చిన్నారిని కారు ఢీ కొట్టడంతో మృతి చెందింది. ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన చిన్న తిరుపతమ్మ, బాల వెంకటమ్మ దంపతులు. వీరు సిటీకి వలసవచ్చి మీర్ పేట పరిధిలోని భూపేష్ నగర్లో కూలీ పనులు చేసుకుంటున్నారు. వీరు కుమార్తె బాలమ్మ (2) సోమవారం సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటుండగా, అతివేగంగా వచ్చి కారు ఢీ కొట్టింది.
ఆ తర్వాత ఆమె తలపై నుంచి కారు టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వంశీ అనే వ్యక్తిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.