- గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
మిర్యాలగూడ, వెలుగు : నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో ప్రమాదవశాత్తు ఇద్దరు ప్రైవేట్ యువ ఇంజినీర్లు గల్లంతైన సంఘటన బుధవారం సాయంత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఐలాపురం వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, మిర్యాలగూడ రూరల్ పోలీసులు వివరాలు ప్రకారం.. యూపీ కి చెందిన కార్తీక్ మిశ్రా (24), విజయ్ గోస్వామి (25) లు పట్టణంలోని రవీందర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరు దామరచర్ల మండల పరిధిలో యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ లో ప్రైవేట్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.
సెలవు రోజు కావడంతో నూతన ఏడాది పురస్కరించుకొని మొత్తం 8 మంది స్నేహితులు కలిసి సరదాగా ఐలాపురం వద్ద ఎడమకాల్వకు చేరుకున్నారు. వీరిలో మిగిలిన స్నేహితులు కాల్వలోకి దిగి ఈత కొడుతుండగా.. వీరు కాల్వ మెట్లపై కూర్చుకున్నారు. ప్రమాదవశాత్తు వీరిలో కార్తీక్ మిశ్రా మొదట కాల్వలోకి జారగా అతన్ని రక్షించే క్రమంలో విజయ్ గోస్వామి కాల్వలో పడిపోయారు. వీరిద్దరిని మిత్రులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రవాహ వేగానికి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.