మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లిలో తాత సంవత్సరీకానికి వచ్చిన ఇద్దరు యువకులు సరదాగా వాగులో ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు. గ్రామానికి చెందిన తాటిపాముల సుధాకర్, రమ దంపతుల కొడుకు పవన్ (27) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం కనగర్తికి చెందిన సిరిమల్లె రమేశ్, స్వరూప దంపతుల కొడుకు శ్రీకాంత్ (18) పదో తరగతి చదువుతున్నారు. వీరి తాత తాటిపాముల రాజీరు సంవత్సరీకం శుక్రవారం గ్రామంలో జరగడంతో ఇద్దరూ వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత పవన్, శ్రీకాంత్ అదే గ్రామానికి చెందిన మరో యువకుడు సాయి చరణ్‌తో కలిసి వేములపల్లి శివారులోని పెద్ద వాగులో ఈతకు వెళ్లారు.
సాయిచరణ్‌కు ఈత రాకపోవడంతో ఒడ్డు మీద ఉండగా పవన్, శ్రీకాంత్ నీటిలోకి దిగి గల్లంతయ్యారు. దీంతో సాయిచరణ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు చెప్పారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాలించగా ఇద్దరి డెడ్‌బాడీలు దొరికాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చిట్యాల సీఐ వేణు చందర్, ఎస్సై జాడి శ్రీధర్ చెప్పారు.