ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు ఇద్దరు యువకులు బలి.. హైదరాబాద్‌‌లో ఒకరు, కామారెడ్డి జిల్లాలో మరొకరు ఆత్మహత్య

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు ఇద్దరు యువకులు బలి.. హైదరాబాద్‌‌లో ఒకరు, కామారెడ్డి జిల్లాలో మరొకరు ఆత్మహత్య
  • బెట్టింగ్‌‌లతో రూ.కోటి 30 లక్షలు అప్పు చేసిన సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ఇంజినీర్​
  • రూ.2.60 లక్షలు పొగొట్టుకున్న ఆఫీస్‌‌ బాయ్‌‌

కామారెడ్డి / మాదాపూర్​, వెలుగు: ఆన్‌‌లైన్‌‌ బెట్టింగులకు ఇద్దరు యువకులు బలయ్యారు. హైదరాబాద్‌‌లో ఒకరు, కామారెడ్డి జిల్లాలో మరొకరు ఉరేసుకున్నారు. బెట్టింగ్‌‌లకు అలవాటుపడి పెద్ద ఎత్తున అప్పులు చేసి.. వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన దేవల సంజయ్​(29) సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంజయ్ గత రెండేండ్లుగా ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్‌‌లకు అలవాటు పడ్డాడు. గ్రామస్తులతోపాటు తెలిసినవాళ్ల దగ్గర భారీగా అప్పులు చేసి, బెట్టింగ్‌‌లో పోగొట్టుకున్నాడు. 

దాదాపు రూ.కోటి 30 లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక, తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. అప్పులు గురించి భార్యతో తరుచూ చెబుతూ బాధపడేవాడు. దీంతో అప్పులు తీర్చడానికి ఆమె తండ్రి కూడా కొంత సాయం చేశాడు. అయినా సంజయ్‌‌‌‌లో మార్పు రాకపోవడంతో 6 నెలల కింద పిల్లలను తీసుకొని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఈ నెల 16న భార్యకు ఫోన్ చేసి మళ్లీ అప్పుల గురించి చెప్తూ బాధపడ్డాడు. తర్వాత ఆదివారం అర్ధరాత్రి తన రూమ్‌‌‌‌లో ఫ్యాన్‌‌‌‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఉన్న అతని తల్లి, చెల్లెలు గమనించగా, అప్పటికే చనిపోయాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

హైదరాబాద్‌‌‌‌లో మరొకరు..

హైదరాబాద్‌‌‌‌లో ఓ కంపెనీలో ఆఫీస్‌‌‌‌ బాయ్‌‌‌‌గా పనిచేస్తున్న సిరిసిపల్లి మోహన్ అరవింద్ కుమార్ (22) ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బెట్టింగుల్లో డబ్బులు పొగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా సైదిల్‌‌‌‌పేట్‌‌‌‌కు చెందిన అరవింద్ కుమార్ తన కుటుంబంతో కలిసి మాదాపూర్ శిల్పాహిల్స్‌‌‌‌లో నివాసం ఉంటున్నాడు. గత కొంత కాలంగా అతను ఆన్‌‌‌‌లైన్ గేమ్స్ ఆడుతూ రూ.2 లక్షల వరకు పొగొట్టాడు. 

ఆదివారం రాత్రి కూడా ఆన్‌‌‌‌లైన్ గేమ్‌‌‌‌ ఆడి మరో రూ.60 వేల వరకు పొగొట్టుకున్నాడు. దీంతో అరవింద్‌‌‌‌ను తల్లి మందలించింది. మనస్థాపానికి గురైన అతను సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్‌‌‌‌కు చున్నీతో ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.