ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
  •  నల్గొండ జిల్లాలో ఘటన
  •  జగిత్యాల జిల్లాలో గోదావరిలో పడి మరొకరు మృతి

చిట్యాల, వెలుగు : సరదాగా ఈత కొట్టేందుకు కుంటలోకి దిగిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్‌‌ గ్రామంలో ఆదివారం జరిగింది. నల్గొండ మండలం ముషంపల్లి పరిధిలోని రసులూరుకు చెందిన చింతపల్లి రాఘవేంద్ర (21), వెలుగుపల్లికి చెందిన నలుపరాజు నవీన్‌‌కుమార్‌‌, నార్కట్‌‌పల్లి మండలం గోపలాయపల్లికి చెందిన కడెం తరణ్‌‌ స్నేహితులు. 

వీరు ఏపూర్‌‌ గ్రామ శివారులోని డీఈసీ కంపెనీలో ఎలక్ట్రీషియన్స్‌‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో ముగ్గురు కలిసి బయటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా కంపెనీ పరిధిలోనే ఓ నీటి కుంట కనిపించడంతో ఈత కొట్టేందుకు నవీన్‌‌ దూకాడు. రాఘవేంద్ర, తరుణ్‌‌ను కూడా రావాలని పిలవడంతో వారికి ఈత రాకపోయినా నీటిలోకి దిగారు. రాఘవేంద్ర నీటిలో మునిగిపోతుండడంతో అతడిని కాపాడేందుకు నవీన్‌‌ ప్రయత్నించాడు. 

ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగి చనిపోయారు. తరుణ్‌‌ చేతికి ఓ ప్లాస్టిక్‌‌ పట్టా అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే కంపెనీలోని సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కుంట వద్దకు చేరుకొని రాఘవేంద్ర, నవీన్‌‌ డెడ్‌‌బాడీలను బయటకు తీశారు.

గోదావరిలో పడి ఒకరు...

జగిత్యాల టౌన్‌‌/వెల్గటూర్, వెలుగు : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటి లింగాల వద్ద గోదావరిలో స్నానం చేస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్‌‌కు చెందిన విఘ్నేశ్‌‌ (26) గోదావరిలో స్నానం చేసేందుకు భార్య శ్రీలతతో కలిసి ఆదివారం కోటిలింగాల వద్దకు వచ్చాడు. 

నదిలోకి దిగి స్నానం చేస్తున్న క్రమంలో విఘ్నేశ్‌‌ నీటిలో మునిగిపోయాడు. గమనించిన శ్రీలత కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి గాలించినా దొరకలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు గజ ఈతగాళ్లతో నదిలో గాలించడంతో విఘ్నేశ్‌‌ డెడ్‌‌బాడీ దొరికింది. శ్రీలత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.