డీసీఎంను ఢీకొట్టిన కారు..  ఇద్దరు యువకులు దుర్మరణం..హైదరాబాద్ -సిద్దిపేట హైవేపై ప్రమాదం

డీసీఎంను ఢీకొట్టిన కారు..  ఇద్దరు యువకులు దుర్మరణం..హైదరాబాద్ -సిద్దిపేట హైవేపై ప్రమాదం
  • శామీర్​పేట జీనోమ్ వ్యాలీ పీఎస్​ పరిధిలో ఘటన

శామీర్ పేట, వెలుగు: హైదరాబాద్– -సిద్దిపేట జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ యాక్సిడెంట్​లో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన మేడ్చల్​జిల్లా శామీర్​పేట పరిధిలోని తుర్కపల్లి జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటలకు హైదరాబాద్-– సిద్దిపేట హైవే ఫారెస్ట్ గెస్ట్​హౌస్ సమీపంలో.. హైదరాబాద్ వైపు నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని.. తుర్కపల్లి వైపు నుంచి శామీర్ పేట వైపు వస్తున్న టాటా సఫారీ కారు ఢీ కొట్టింది. మొదట అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొన్న కారు.. ఓవర్ స్పీడ్ తో రోడ్డు అవతల ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ పక్కనున్న వ్యక్తితో పాటు, కారు డ్రైవర్ పక్కనున్న వ్యక్తి మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. డీసీఎం వ్యాన్ లో డ్రైవర్ పక్కన కూర్చున్న యువకుడిని సిద్దిపేట జిల్లా వర్గల్ కు చెందిన తలారు రాజు(18)గా, సఫారీ కారులో ఉన్న యువకుడిని మురాహరిపల్లికి చెందిన దార  శ్రావణ్  (23) గా పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్​జరిగిన సమయంలో డీసీఎం వాహనంలో ముగ్గురు, సఫారీలో ఆరుగురు ఉన్నారు. గాయాలైన వారిని స్థానికంగా ఉన్న ఆర్ వీఎం ఆస్పత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు జీనోమ్ వ్యాలీ పోలీసులు తెలిపారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం మేడ్చల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.