
మేకను ఎత్తుకెళ్లారంటూ ఇద్దరు దళిత యువకులను వేలాడదీసి కొట్టారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. మందమర్రిలోని యాపల్ ప్రాంతానికి చెందిన రాములు మేకలను పెంచుతున్నాడు. 8 రోజుల కింద ఒక మేక కనిపించకుండా పోయింది. అదే ఏరియాకు చెందిన చిలుముల కిరణ్, అతని ఫ్రెండ్ తేజ మేకను దొంగతనం చేశారని ఆరోపిస్తూ రాములు కుటుంబ సభ్యులు ఇద్దర్ని షెడ్డులో వేలాడదీసి కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
కోల్‌బెల్ట్, వెలుగు : మేకను ఎత్తుకెళ్లారనే అనుమానంతో ఇద్దరు దళిత యువకులను తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో శనివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివి.. మందమర్రిలోని యాపల్ ప్రాంతానికి చెందిన రాములు శ్రీనివాస్ రైల్వేట్రాక్ సమీపంలో షెడ్డు ఏర్పాటు చేసుకొని మేకలు పెంచుతున్నాడు. 8 రోజుల కింద షెడ్డు నుంచి ఒక మేక కనిపించకుండాపోయింది. అదే ఏరియాకు చెందిన తాపీమేస్త్రీ వద్ద కూలిపనులు చేసే చిలుముల కిరణ్, అతని స్నేహితుడు తేజ మేకను దొంగతనం చేశారని ఆరోపిస్తూ శుక్రవారం రాములు కుటుంబ సభ్యులు వారిద్దరిని తీసుకెళ్లి షెడ్డులో తలకిందులుగా కట్టేసి కొట్టారు. డబ్బులు ఇస్తేనే విడిచిపెడుతామని చెప్పడంతో తాపీమేస్త్రీ శ్రావణ్ డబ్బులు కడ్తానని ఒప్పుకొని కిరణ్‌ను విడిచిపించుకొని వెళ్లాడు. కానీ శుక్రవారం సాయంత్రం నుంచి కిరణ్ కనిపించకుండాపోయాడని అతని చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం మందమర్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిరణ్ దళితుడు కావడంతో పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిరణ్ జాడ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.