డబ్బుల కోసం దారుణం .. సమీప బంధువు ఫొటోలు మార్ఫింగ్

డబ్బుల కోసం దారుణం .. సమీప బంధువు ఫొటోలు మార్ఫింగ్
  • అడిగినన్ని పైసలు ఇవ్వకుంటే ఇన్​స్టాలో పోస్ట్​ చేస్తామంటూ బ్లాక్​మెయిల్​
  • విషయం తెలుసుకున్న బంధువులు
  • నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువకులకు దేహశుద్ధి

ఇబ్రహీంపట్నం, వెలుగు: అడిగినన్ని పైసలు ఇవ్వకుంటే మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ ​మీడియాలో పోస్టు చేస్తామని సమీప బంధువునే బ్లాక్​మెయిల్​ చేశారు ఇద్దరు ప్రబుద్ధులు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం తొర్రూరు గ్రామానికి చెందిన విజయ్, సాయి ఇంజినీరింగ్​చదువుతున్నారు. రూ.20 వేల కోసం తమ సమీప బంధువైన మహిళకు వారం రోజులుగా ఫోన్​ చేసి ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు ఇవ్వకుంటే మార్ఫింగ్ చేసిన ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో పెడతామన్నారు.

 దీంతో విషయం తెలుసుకున్న సదరు మహిళ భర్త ఏం చేయాలో అర్థంకాక మనోవేదనకు గురయ్యారు. బుధవారం కొంతమంది బంధువులను తీసుకొని నిందితులిద్దరితోపాటు వారికి సహకరించిన సిద్దాల సూర్యను నిలదీసేందుకు వెళ్లాడు. అనంతరం వారిని ఇబ్రహీంపట్నం మండలం నాగాన్​పల్లిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదాడు. ఇలాంటివి మళ్లీ చేస్తే బాగుండదని హెచ్చరించారు. అయితే, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇరువురు ఇబ్రహీంపట్నం పీఎస్​లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.