వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఒకరు మోపిదేవి వెంకట రమణ, మరొకరు బీద మస్తానరావు. వీళ్లిద్దరినీ వైసీపీ తరపున రాజ్యసభకు పంపించారు జగన్. వీళ్లిద్దరూ ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వంతోపాటు వైసీపీ పార్టీకి సైతం రాజీనామా చేయటం సంచలనంగా మారింది.
ఇవాళ ( ఆగస్టు 29, 2024 ) రాజ్యసభ సభ్యత్వానికి ఇద్దరు ఎంపీలు రాజీనామా లేఖలు సమర్పించారు. బుధవారం రాత్రే ఢిల్లీ చేరుకున్న ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు.. రాజ్యసభ ఛైర్మెన్ జగదీప్ ధనకర్ ని కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు.
ఈ క్రమంలో మోపిదేవి, బీద మస్తాన్ రావులు సెప్టెంబర్ 5 లేదా 6 తేదీన మంత్రి నారా లోకేష్ ని కలిసి టీడీపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ ఇద్దరితో పాటు త్వరలోనే ఇంకొంతమంది నాయకులు వైసీపీని వీడనున్నారని టాక్ వినిపిస్తోంది. మోపిదేవి, మస్తాన్ రావుల బాటలోనే పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబూరావు, అయోధ్యరామిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, మేడా రఘునాథరెడ్డి వంటి నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని టాక్ వినిపిస్తోంది.