తెలంగాణలో తైవాన్​ ఇండస్ట్రియల్​ పార్క్​

తెలంగాణలో తైవాన్​ ఇండస్ట్రియల్​ పార్క్​

టీజీఐఐసీతో తైవాన్​ చాంబర్​ ఆఫ్​ కామర్స్​ ఒప్పందం
రాష్ట్రంలో ఎంట్రాప్రెన్యూర్​ ట్రైనింగ్​ సెంటర్ ఏర్పాటు చేస్తం: మంత్రి శ్రీధర్​బాబు
వచ్చే నాలుగేండ్లలో 50 వేల మంది యువతకు శిక్షణ ఇస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తైవాన్​ ఇండస్ట్రియల్​ పార్కు  రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. తైవాన్​ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి వీలుగా ప్రత్యేకంగా ఓ ఆఫీసు ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా మంగళవారం తెలంగాణ ఇండస్ట్రియల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కార్పొరేషన్​(టీజీఐఐసీ) ఎండీ విష్ణువర్ధన్​ రెడ్డి, తైవాన్​ చాంబర్​ ఆఫ్​ కామర్స్​(టీసీసీ) వైస్​ ప్రెసిడెంట్​ సైమన్​ లీ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందంతో రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు పెరుగుతాయనిఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా కొత్తగా వందలాది మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో తైవాన్​ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేలా టీసీసీ కీలకంగా వ్యవహరించనుంది. ఇప్పటికే ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి మార్కెట్​ ఎంట్రీ రీసెర్చ్, పెట్టుబడిదారులతో సమావేశాలను నిర్వహించింది. మరోవైపు పరిశ్రమల స్థాపనకోసం రాష్ట్రాన్ని ఇంటర్నేషనల్​ లెవెల్​లో ప్రభుత్వం ప్రమోట్​చేస్తున్నది.    

ఈడీఐఐ సహకారంతోఎంట్రాప్రెన్యూర్​ ట్రైనింగ్​ సెంటర్

రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల (ఎంట్రాప్రెన్యూర్) శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఐటీ మంత్రి శ్రీధర్​ బాబు చెప్పారు. అహ్మదాబాద్​కు చెందిన ఎంట్రాప్రెన్యూర్​షిప్​ డెవలప్​మెంట్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా (ఈడీఐఐ) సహకారంతో ఆ ట్రైనింగ్​ సెంటర్​ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. మంగళవారం మంత్రి శ్రీధర్​బాబుతో ఈడీఐఐ డైరెక్టర్​ జనరల్​ సునీల్​ శుక్లా సమావేశమయ్యారు. తమ సంస్థ చేపట్టనున్న కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించారు. 

ఎంట్రాప్రెన్యూర్​ ట్రైనింగ్​ సెంటర్​ ఏర్పాటు కోసం వివిధ సంస్థలతో కలిసి ఒక కన్సార్టియంను ఏర్పాటు చేస్తామని శ్రీధర్​ బాబు చెప్పారు. 17 రాష్ట్రాల్లో ఇప్పటికే ఐడీఈఈ ఇలాంటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ సెంటర్​ ద్వారా వచ్చే నాలుగేండ్లలో 50 వేల మంది యువతకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పేలా శిక్షణనిస్తామన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ఏటా కనీసం 5 వేల మంది సొంతంగా ఉపాధి కల్పించుకునేలా, శిక్షణ తర్వాత 6 నెలల వరకు ఈడీసీ సహకారం అందిస్తుందని చెప్పారు. కరోనా​సమయంలో నష్టపోయిన ఎంఎస్​ఎంఈలకు ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.