
ఏదైనా భౌగోళిక ప్రాంతంలో సహజసిద్ధంగా పెరిగే వృక్షాలు అధికంగా ఉంటే ఆ ప్రాంతాన్ని అడవి అని పిలుస్తారు. అడవిలో తుప్పలు, పొదలు కూడా కొంత వరకు ఉండవచ్చు. దేశంలో వర్షపాత విస్తరణ, నేలల స్వభావం, భూభాగాల ఎత్తు ఆధారంగా అడవులను ఐదు ప్రధాన రకాలుగా విభజించారు. వీటిని సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చు అడవులు, చిట్టడవులు లేదా పొద అడవులు, టైడల్ అరణ్యాలు, పర్వత ప్రాంత అరణ్యాలుగా వర్గీకరించారు.
సతత హరిత అరణ్యాలు
200 సెం.మీ.ల కంటే ఎక్కువ వర్షపాతం, 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 50శాతం కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అరణ్యాల్లో పెరిగే వృక్షాలు 40–50 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. గట్టి కలపనిస్తాయి. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. ఉష్ణమండల తేమతో కూడిన సతత హరితాలు, ఉష్ణ మండల సతత హరితాలు.
ఉష్ణమండల తేమతో కూడిన సతత హరితాలు: ఇవి వర్షపాతం 250 సెం.మీ.ల కంటే ఎక్కువగా గల పశ్చిమ కనుమల పశ్చిమ వాలులు, అరుణాచల్‌ప్రదేశ్, అసోం ఎగువ ప్రాంతం, నాగాలాండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అరణ్యాల్లో పెరిగే ముఖ్యమైన వృక్ష జాతులు ఎయిని, తెత్సార్, ఎబోని, మహాగని, రోజ్‌వుడ్, సికోనా, రబ్బర్.
ఆకురాల్చు అడవులు: 100 నుంచి 200 సెం.మీ.ల వర్షపాతం, 27 డిగ్రీల సెంటీగ్రేడ్ వార్షిక ఉష్ణోగ్రత, 60 నుంచి 70 శాతం గాలిలో తేమ ఉన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వేసవిలో భాష్పోత్సేక ప్రక్రియను నియంత్రించడానికి ఈ అడవుల్లో పెరిగే వృక్షాలు తాత్కాలికంగా ఆకులను రాలుస్తాయి. వీటినే రుతుపవన ప్రాంతపు అరణ్యాలు అని కూడా పిలుస్తారు. ఇవి దేశంలో వాణిజ్యపరంగా అత్యంత విలువైన అరణ్యాలు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు, ఉష్ణమండల అనార్ధ్ర ఆకులు రాల్చే అరణ్యాలు.
ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు: పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతం, ద్వీపకల్ప భూభాగ ఈశాన్య ప్రాంతం, శివాలిక్ కొండల్లో 100 నుంచి 200 సెం.మీ.ల వర్షపాతం ఉన్న పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతం, శివాలిక్ కొండలు, టెరాయి, బాబర్ మైదాన ప్రాంతాలు మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతంలోని కొండలు, చత్తీస్‌గఢ్, చోటానాగపూర్, ఒడిశా, పశ్చిమబెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని వీటిని సాల్ అరణ్యాలు అని కూడా పిలుస్తారు. ఇక్కడి ముఖ్యమైన వృక్ష జాతులు సాల్, టేకు, శాండిల్‌వుడ్, షీషమ్, మెహువా, ఖైర్. ఇవి దేశంలో ఎక్కువగా విస్తరించి ఉన్న అరణ్యాలు.
ఉష్ణమండల అనార్ద్ర ఆకురాల్చు అరణ్యాలు: 70 నుంచి 100 సెం.మీల వర్షపాతం గల ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. దేశంలో హిమాలయ పర్వత పాదాల నుంచి కన్యాకుమారి వరకు గల దుర్భిక్ష ప్రాంతాల్లో ఇవి విస్తరించాయి. టేకు, ఎర్రచందనం, చింత, వేప, వెదురు, టెండు, పలాస, సాల్ వంటి వృక్షజాతులు ఇక్కడ విస్తరించి ఉన్నాయి.
చిట్టడవులు, పొద అడవులు: వర్షపాతం 60 నుంచి 75 సెం.మీ.లు గల ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ఇక్కడ జీరోఫైటిక్ వృక్ష జాతులుఉంటాయి. ఈ ప్రాంతాల్లో పెరిగే వృక్షాలు భాష్పోత్సేక ప్రక్రియను నిరోధించడానికి వాటి ఆకులను చిన్నవిగా లేదా మల్లె మాదిరిగా రూపాంతరం చెందించుకొని, కాండాల చుట్టూ మందమైన బెరడును ఏర్పరుచుకొని, బలమైన, లోతైన వేర్లను కలిగి ఉంటాయి.
ఇవి ఎక్కువగా తూర్పు రాజస్తాన్, దక్షిణ పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని మరాఠ్వాడ, షోలాపూర్, విదర్భ ప్రాంతాలు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, కర్ణాటకలోని రాయచూర్, ఒడిశాలోని కలహండి, బోలాంగిరి జిల్లాలు, తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఇవి వంట చెరుకుకు ప్రసిద్ధిగాంచిన అరణ్యాలు, ఆకేషియా, రేగు, బ్రహ్మజెముడు, నాగజెముడు, బబూల్ మొదలైన వృక్ష సంపదకు ప్రసిద్ధిగాంచింది.
టైడల్ అరణ్యాలు:
ఇవి సముద్ర తీర ప్రాంత చీలికలు, ఎస్టురీస్, చిత్తడి నేలలు, నదీ ముఖ ద్వారాల వద్ద 40 నుంచి 200 సెం.మీల వర్షపాతం గల ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటినే మాంగ్రూవ్స్ అని, మడ అరణ్యాలని పిలుస్తారు. పశ్చిమబెంగాల్లోని ఈ అరణ్యాల్లో సుంద్రి అనే వృక్షజాతి ఎక్కువగా విస్తరించి ఉండటంతో వీటిని అక్కడ సుందర్బన్ అరణ్యాలు అని పిలుస్తారు. దేశంలోని మొత్తం విస్తీర్ణంలో ఇవి 0.15శాతం ఉన్నాయి. మాంగ్రూవ్స్ అటవీ విస్తీర్ణం ఎకువగా గల రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో వరుసగా గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. పర్యావరణపరంగా ఇవి అత్యంత ప్రాముఖ్యత గల అరణ్యాలు. తీర ప్రాంతాల స్థిరీకరణ, విలక్షణమైన జీవజాతులకు ఆవాసాన్ని కలిగించడంలో సముద్ర ఉప్పునీరు తీర ప్రాంత డెల్టా నేలలోకి ప్రవేశించకుండా నియంత్రించడంలో సైక్లోన్స్, సూపర్ సైక్లోన్స్ సమయాల్లో తీరాన్ని తాకే ఎత్తయిన కెరటాల నుంచి తీర ప్రాంత భూభాగాలను పరిరక్షించడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి.
పర్వత ప్రాంత అరణ్యాలు
దేశంలో వర్షపాతం 75 నుంచి 125 సెం.మీ.లు గల హిమాలయ వాలులు, నీలగిరి, అన్నామలై వాలుల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. హిమాలయాల్లో ఎత్తు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లేకపోవడంతో ఈ ప్రాంత అరణ్యాలను నాలుగు రకాలు విభజించవచ్చు.
ఎ. 1000 మీటర్లు – ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు. ఇవి టెరాయి, శివాలిక్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ముఖ్యమైన వృక్ష జాతులు సాల్, వెదురు, టేకు.
బి. 1000–1800 మీటర్లు – ఉప ఉష్ణమండల వెడల్పాటి ఆకులతో కూడిన సతత హరితాలు. ఇవి హిమాచల్ దిగువ ప్రాంతాల్లో (హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్) విస్తరించి ఉన్నాయి. ఇవి సమశీతోష్ణ మండల రకానికి చెందిన అడవులు. అక్కడ పెరిగే ముఖ్యమైన వృక్ష జాతులు ఓక్, మాపెల్, జునిఫర్, ఎబోని, మహాగని.
సి. 1800–3300 మీటర్లు – శృంగాకార అరణ్యాలు లేదా టైగాలు. ఇవి హిమాచల్ ఎగువ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ పెరిగే ముఖ్యమైన వృక్షజాతులు సిల్వర్ఫర్, పైన్, దేవదారు, స్ప్రూవ్, విల్లోస్.
డి. 3300 మీటర్లు – అంతకంటే ఎక్కువ ఎత్తులో పెరిగేవి ఆల్ఫైన్ అరణ్యాలు. ఇవి హిమాద్రి హిమాలయాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ పెరిగే ముఖ్యమైన వృక్ష జాతులు చిర్, బిర్చ్, జునిఫర్, పచ్చిక మైదానాలు.
ఇ. షోలాస్‑– నీలగిరి, అన్నామలై కొండల్లో 1200 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తులో పెరిగే సమశీతోష్ణ మండల అరణ్యాలు షోలా అడవులు అంటారు.
ఉష్ణమండల ఆర్ద్ర సతత హరితాలు
200 నుంచి 250 సెం.మీ.ల వర్షపాతం గల ప్రాంతాలైన పశ్చిమ తీర మైదానా లు అసోం, తూర్పు హిమాలయాల దిగువ వాలులు, ఒడిశా, అండమాన్ దీవుల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన వృక్షజాతులు లారెల్, సిడార్, చంప, చెస్ట్‌నట్స్, రోజ్‌వుడ్, ఐవరీ వుడ్, హల్లాక్.