Holi 2025: హోలీ ఏ రాష్ట్రంలో ఎలా.. రంగులు ఒకటే కానీ..

Holi 2025: హోలీ ఏ రాష్ట్రంలో ఎలా.. రంగులు ఒకటే కానీ..

హోలీ అంటే రంగుల పండుగ. చిన్నాపెద్దా.. ఆడిపాడే సంబురం. కులం, మతం.. అనే తేడా లేకుండా చేసుకునే ఉత్సవం. అందుకే హోలీని అంతా ఎంజాయ్ చేస్తరు. మన దేశంలోనే కాదు పక్కనున్న నేపాల్లో, బంగ్లాదేశ్ లో కూడా. అంతేకాదు ఎన్ఆర్ఎలు ఎక్కువగా ఉన్న అమెరికాలో మన పండుగ కలర్ఫుల్గా జరుగుతది. అయితే, మన దేశంలో ఏయే రాష్ట్రాల్లో ఈ పండుగ ఎట్ల జరుపుకుంటరంటే..

బిహార్ లో:

ఫాల్గుణ పూర్ణిమకు ముందు రోజు బీహారీలు పెద్ద పెద్ద మంటలు వేస్తారు. దీని కోసం పిడకలతో పాటు ఆరాడ్, హోలీకలప, పంటలు కోసిన తర్వాత మిగిలిన పొట్టు వాడతారు.. పండుగ రోజు జానపద పాటలు పాడుతూ... డ్యాన్స్ చేస్తారు.

పంజాబ్ లో:

ఇక్కడ సిక్కులు కూడా హోలీని ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ ఈ పండుగను 'హోలా మొహల్లా'' అంటారు. అయితే, మన దేశం మొత్తంమీద 'ఆనంద్పూర్ సాహిబ్'లో చేసే హోలీకి చాలా పేరుంది.

ఉత్తరప్రదేశ్ లో:

ఈ రాష్ట్రంలోని 'బర్చాన' ప్రదేశం హోలీ పండుగకు ప్రసిద్ధి. ఇక్కడ 'రాధా, రాణి' ఆలయంలో 'లాఠ్ మార్ హోలీ' అనే ఆట ఆడతారు. 'లార్ మార్ హోలీ'లో వేల మంది ఎదుట మగవాళ్లను మహిళలు కర్రలతో కొడతారు.

ఒడిశాలో:

ఒడిశా ప్రజలు కూడా హోలీని ఘనంగా చేస్తారు. అయితే, శ్రీకృష్ణుడు, రాధ విగ్రహాలకు బదులుగా పూరీలో ఉన్న జగన్నాథుడి విగ్రహాలను పూజించడం ఆనవాయితీ.

బెంగాల్ లో:

ఈ రాష్ట్రంలోని పెద్ద పట్టణాల వీధుల్లో శ్రీకృష్ణుడు, రాధ ప్రతిమలను అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు. ఆడవాళు నాట్యం చేస్తుంటే.. వాళ్ల చుట్టూ భక్తులు తిరుగుతూ పాటలు పాడతారు. పండుగ రోజు సంప్రదాయ వంటకాలు 'మల్పోయే', 'కీర్ సందేష్'. 'బాసంతి సందేష్'.పాయసం లాంటివి చేస్తారు. 

గుజరాత్ లో:

ఈ రాష్ట్రంలో రంగుల పండుగ ఘనంగా జరుగుతుంది. కాలనీలు, వీధుల్లో భోగీ మంటలు వేసి.. ప్రార్ధనలు
చేస్తారు... ఆడిపాడతారు. ఇలా చేయడం వల్ల చెడు జరగదని వాళ్ల నమ్మకం. అయితే, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలలోజన్మస్థలం అయిన మధురలో, బృందావన్లో హోలీ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. పండుగ చివరి పదహారు రోజులు శ్రీకృష్ణుడిని పూజిస్తారు.

ALSO READ | HOLI 2025: రంగుల ఆట తర్వాత తల స్నానం ఇలా చేయండి..

అహ్మదాబాద్ లో:

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఒక కుండలో మజ్జిగ వేసి వీధిలో వేలాడదీస్తారు. యువకులు ఆ కుండను పగలకొట్టడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో అమ్మాయిలు వాళ్లపై నీళ్లు విసురుతారు. అంతేకాదు రంగులు పడకుండా జాగ్రత్తగా ఉండే వాళ్లని ఎగతాళి చేస్తూ రంగులతో తడిసిన పురుషులను వీధుల్లో ఊరేగిస్తారు. చివరకు ఎవరు ఆ కుండను పగులగొడతారో... అతడికి 'హోలీ రాజు'గా కిరీటం ధరిస్తారు.

నేపాల్ లో:

నేపాల్లో హోలీ రోజున జాతీయ సెలవు దినం. ఈ దేశంలో 80శాతం ప్రజలు హిందువులే. ముస్లింలు, క్రైస్తవులు కూడా హోలీని ఘనంగా చేస్తారు. చాలామంది పానీయాలు, ఆహారంలో గంజాయి కలుపుకొని తాగుతారు. రంగులతో అదుకోవటం వల్ల తమ బాధలు పోతాయని నేపాలీల నమ్మకం.

మహారాష్ట్రలో:

ఇక్కడ హోలీ పండుగని 'షింగా' అంటారు. పండుగకు ఒక వారం ముందు యువకులు కట్టెలు తీసుకొచ్చి ఇళ్ల ముందు పోగు చేస్తారు. హోలీ రోజున కట్టెలను ఒక చోట పెట్టి.. సాయంత్రం మండిస్తారు. ఇక్కడ 'పూరణ్ పోలి' అనే తీపి వంటకం చేస్తారు.

మణిపూర్ లో:

ఇక్కడ హోలీ ఆరు రోజుల పండుగ. యువకులు తెలుపు, పసుపు రంగుల్లో ఉండే తలపాగాలు ధరిస్తారు. పండుగ రోజు రాత్రి 'తాబల్ చోంగ్బా' అనే జానపద నృత్యం చేస్తారు. తమతో 'గులాల్' అనే ఆట ఆడాలని అమ్మాయిలకు అబ్బాయిలు డబ్బులిస్తారు.