హైదరాబాద్: సినిమా షూటింగ్ లో గాయపడి శస్త్ర చికిత్స చేయించుకున్న విలక్షణ నటుడు కొద్దిసేపటి క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. గత మంగళవారం హైదరాబాద్ లో తమిళ హీరో ధనుష్ సినిమా షూటింగ్ లో ప్రకాష్ రాజ్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయం కలకలం రేపడంతో వెంటనే ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో స్పందించి ఆందోళన చెందాల్సిందేమీ లేదని.. హైదరాబాద్ లో సర్జరీ చేయించుకోనున్నట్లు ప్రకాశ్ ట్వీట్ చేశారు. షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో తనకు చిన్న ఫ్యాక్చర్ అయిందని, హైదరాబాద్‌లో డాక్టర్ గురవారెడ్డి తనకు సర్జరీ చేస్తారని, తన కోసం ప్రార్థించాల్సిందిగా అభిమానులను కోరారు.
నగరంలోని సన్ షైన్ ఆస్పత్రిలో చేరగా డాక్టర్ గురువారెడ్డి నేతృత్వంలోని వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. సోమవారం పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు మరోసారి పరీక్షలు చేసి డిశ్చార్జ్ చేసి పంపారు. ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి ప్రకాష్ రాజ్ ను ఆస్పత్రిలో నుంచి కారు వరకు స్వయంగా తోడు వెళ్లి ఇంటికి సాగనంపారు. ఇదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ వెల్లడించారు.