దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఆసియా కప్ 2023 అండర్ 19లో భారత యువ జట్టు తడబడుతోంది. తొలి మ్యాచ్‌లో అఫ్ఘనిస్తాన్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన యంగ్ ఇండియా.. ఆదివారం దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. తొలుత టీమిండియా 259 పరుగులు చేయగా.. పాక్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత కుర్రాళ్లు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేశారు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (62), కెప్టెన్ ఉదయ్ సహారన్ (60), సచిన్ దాస్ (58) అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో భారత జట్టు.. పాక్ ఎదుట ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది.
అజాన్ అవైస్ సెంచరీ
అనంతరం 260 పరుగుల ఛేదనలో అజాన్ అవైస్(105 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. అతనికి మరో ఎండ్ నుంచి షాజైబ్ ఖాన్ (63), సాద్ బేగ్(68 నాటౌట్) చక్కటి సహకారాన్ని అందించారు. అజాన్ అవైస్- షాజైబ్ ఖాన్ జోడి రెండో వికెట్ కు ఏకంగా 110 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
భారత జట్టు తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మంగళవారం(డిసెంబర్ 13) జరగనుంది.