- అండర్–19 టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాకు రెండో విక్టరీ
- 10 వికెట్ల తేడాతో మలేసియా చిత్తు
కౌలాలంపూర్ : అరంగేట్రం స్పిన్నర్ వైష్ణవి శర్మ (5/5) హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో మ్యాజిక్ చేయడంతో అండర్–19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా వరుసగా రెండో భారీ విజయం సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఆతిథ్య మలేసియా జట్టును చిత్తుగా ఓడించింది. ఈ మెగా టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ నమోదు చేసిన బౌలర్‌గా వైష్ణవి రికార్డుకెక్కింది.
ఆమెతో పాటు మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆయుషి శుక్లా (3/8) కూడా విజృంభించడంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన మలేసియా 14.3 ఓవర్లలో 31 రన్స్‌కే కుప్పకూలింది. ఓపెనర్ నుర్ అలియా బింటి (5), నజతుల్ హిదాయత్ (5) టాప్ స్కోరర్లు. ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన 11 రన్సే మలేసియా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరు కావడం గమనార్హం. జోషిత ఒక వికెట్ పడగొట్టింది.
అనంతరం హైదరాబాదీ గొంగడి త్రిష (12 బాల్స్‌లో 5 ఫోర్లతో 27 నాటౌట్) మెరుపులతో ఇండియా 2.5 ఓవర్లలోనే 32/0 స్కోరు చేసి గెలిచింది. ఈ మ్యాచ్ 18 ఓవర్లలోనే ముగియడం విశేషం. వైష్ణవికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బుధవారం జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకతో పోటీ పడనుంది.