U19 World Cup 2024: క్రీడాస్ఫూర్తి మరిచిన కుర్ర క్రికెటర్లు.. ఔట్‌పై వివాదం

U19 World Cup 2024: క్రీడాస్ఫూర్తి మరిచిన కుర్ర క్రికెటర్లు.. ఔట్‌పై వివాదం

అండర్-19 ప్రపంచ కప్‌లో ఓ బ్యాటర్ ఔటైన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. బంతి చేతికి అందించడమే అతని పాపమైంది. అది తప్పా..! ఒప్పా..! అని నిర్ధారించాల్సిన అంపైర్లు కూడా ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా వ్యహరించారు. క్రికెట్ నిబంధనలు కూడా అందుకు ఓ కారణం. పొట్చెఫ్‌స్ట్రూమ్‌ వేదికగా ఇంగ్లండ్ - జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

శనివారం(ఫిబ్రవరి 3) పొట్చెఫ్‌స్ట్రూమ్‌ వేదికగా ఇంగ్లండ్ - జింబాబ్వే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో ఇంగ్లండ్ ఆటగాడు హంజా షేక్ ఓ బంతిని డిఫెన్సివ్ షాట్ ఆడాడు. దాంతో బంతి వికెట్ల ముందు ఉండిపోయింది. ఆ సమయంలో జింబాబ్వే వికెట్ కీపర్ ర్యాన్ కమ్వెంబా బంతిని తీసుకునే ప్రయత్నం చేయగా.. హంజా షేక్ నేను అందిస్తాను అన్నట్లుగా బంతిని అతనికి అందించాడు. ఇదే అతని ఔట్‌కు దారితీసింది.  

అతను బంతిని తాకిన వెంటనే జింబాబ్వే ఆటగాళ్లు అబ్‌స్ట్రక్షన్ ఫీల్డ్ అంటూ అప్పీల్ చేశారు. దీనిపై ఆన్ ఫీల్డ్ అంపైర్లు ఎటూ తేల్చలేకపోయారు. సమీక్షించిన థర్డ్ అంపైర్.. ఫీల్డర్ అనుమతి లేకుండా బ్యాటర్ బంతిని అడ్డుకున్నారన్న ఉద్దేశ్యంతో ఔట్‌గా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. క్రికెట్ రూల్ 37.4 ప్రకారం..  ఫీల్డర్ అనుమతి లేకుండా ఒక బ్యాటర్ బంతిని తాకినట్లయితే.. అది బంతిని అడ్డుకున్న చర్యగా నిర్ధారిస్తారు. ఈ రూల్ కారణంగానే థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.  

దీంతో హంజా షేక్ నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు. బ్యాటర్.. బంతిని వికెట్ కీపర్‌కు క్యాజువల్‌గా అందజేస్తున్న దృశ్యాలు వీడియోలో చూడవచ్చు. ఈ వివాదాస్పద నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జింబాబ్వే యువ క్రికెటర్లు క్రీడాస్ఫూర్తి మరిచారన్న కామెంట్లు వినపడుతున్నాయి. 

ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 146 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 238 పరుగుల ఛేదనలో 91కే కుప్పకూలింది.