U19 World Cup 2024: భారత జైత్రయాత్ర.. వరుసగా రెండో విజయం

U19 World Cup 2024: భారత జైత్రయాత్ర.. వరుసగా రెండో విజయం

దక్షణాఫ్రికా వేదికగా జరుగుతోన్న అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత యువ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి పోరులో బంగ్లాను చిత్తుచేసిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై భారీ విజయం సాధించింది. గురువారం(జనవరి 25) బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఏకంగా 201 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ముషీర్ ఖాన్ శతకం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగుల భారీ స్కోర్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్(118; 106 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కగా.. కెప్టెన్ ఉదయ్ సహారన్(75; 84 బంతుల్లో 5 ఫోర్లు) పరుగులతో పర్వాలేదనిపించాడు. ఐరిష్ బౌలర్లలో ఆలివర్ రిలే 3 వికెట్లు పడగొట్టగా.. జాన్ మెక్నాలీ 2 వికెట్లు తీసుకున్నారు.

అనంతరం 302 పరుగుల భారీ చేధనకు దిగిన ఐర్లాండ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. 29.4 ఓవర్లలో సరిగ్గా వంద పరుగుల దగ్గర ఆలౌట్‌ అయ్యింది. బౌలర్ డానియల్ ఫార్కిన్ చేసిన 27 పరుగులే అత్యధికం. భారత యువ పేసర్‌ నమన్‌ తివారి 4 వికెట్లతో చెలరేగగా, స్పిన్నర్‌ సౌమీ పాండే 3 వికెట్లు పడగొట్టాడు.

భారత యువ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో యూనైటెడ్‌ స్టేట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈనెల 28న ఆదివారం జరగనుంది.