అరబ్ సామ్రాజ్యం నుంచి అగ్రరాజ్యం వరకు ఇప్పుడు ప్రతి దేశమూ అంగీకరిస్తున్న పవర్ఫుల్ లీడర్ మహ్మద్ బిన్ జాయెద్. ‘ఎంబీజెడ్’గా పాపులర్ అయిన ఈయన ప్రస్తుతం అబుదాబి ప్రిన్స్.సంపదలో రారాజు. అంతేకాదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి ప్రెసిడెంట్ కాని ప్రెసిడెంట్ కింద లెక్క. ట్రిలియన్ డాలర్లకుపైగా నిధులను కంట్రోల్ చేయగల అధికారం ఈయన సొంతం..
కొన్నాళ్ల క్రితం వరకు సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌నే అరబ్ దేశాలకు తిరుగులేని కెప్టెన్ అనుకున్నారు. ‘ఎంబీఎస్’ గా ప్రజాదరణ పొందిన ఆ రూలర్ స్థానాన్ని ప్రస్తుతం ‘ఎంబీజెడ్’ తన లీడర్షిప్ ట్యాలెంట్‌తో సొంతం చేసుకున్నాడు. ఈ మధ్య అరబ్ దేశాల విషయాల్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్ అఫిషియల్స్ సలహాలను గానీ, సీనియర్ సెక్యూరిటీ స్టాఫ్ సూచనలను గానీ పట్టించుకోవట్లేదని; ఎంబీజెడ్ అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకుంటున్నాడని టాక్. దీన్నిబట్టి యూఏఈ యువనేత మాటకు ఎంత విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎంబీజెడ్ హవా ఈనాటిది కాదు
అమెరికా జనానికి మొదట్లో మహ్మద్ బిన్ జయెద్ (ఎంబీజెడ్) గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ఏ దేశానికీ లేనన్ని సావరీన్ వెల్త్ ఫండ్స్ (1.3 ట్రిలియన్ డాలర్ల)ను యూఏఈ కలిగి ఉండటం, అవి ఎంబీజెడ్ నియంత్రణలో ఉండటం విశేషం. ఇప్పుడే కాదు. 28 ఏళ్ల కిందటే మహ్మద్ బిన్ జాయెద్ ఏకంగా నాలుగు బిలియన్ డాలర్లను అమెరికా ఖజానాలోకి మరల్చటానికి తన తండ్రి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ని ఒప్పించగలిగారంటే ఆయన పలుకుబడి చిన్నప్పటి నుంచే ఏ రేంజ్లో ఉండేదో ఊహించుకోవచ్చు. అప్పుడు ‘ఎంబీజెడ్ ’ వయసు 29 ఏళ్లు మాత్రమే. 1991లో కువైట్‌పై దండయాత్ర చేసిన ఇరాక్‌ని ఆ దేశం నుంచి వెళ్లగొట్టడానికి అమెరికా సాయం (పెయిడ్ సర్వీసు) కోరిన ఎంబీజెడ్ ఈ మేరకు సొమ్ము చెల్లించారు. ఆ రోజుల్లో యూఏఈ ఎయిర్‌ఫోర్స్‌కి సరైన ఫైటర్ జెట్‌లుగానీ, ఆయుధాలుగానీ లేవు. అసలు ఆ బలగాన్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఆ సమయంలో ఎంబీజెడ్ ఎమిరేట్స్ ఎయిర్‌ఫోర్స్‌లో కమాండర్‌గా పని చేస్తున్నారు. కువైట్‌పై ఇరాక్ దురాక్రమణకు పాల్పడటాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. రేపటి రోజున తమ దేశంపై కూడా ఇలాంటి దాడులు జరిగితే పరిస్థితి ఏమిటని ఆలోచించారు. దాంతో ఆయుధాలను పెద్దఎత్తున సేకరించాలని నిర్ణయించుకున్నారు.
వెపన్స్ కోసం యూఎస్‌లో షాపింగ్
చమురు నిల్వలు దండిగా గల యూఏఈపై ఎటు నుంచయినా హెల్ఫైర్ మిస్సైల్స్, అపాచే హెలికాప్టర్స్, ఎఫ్–16 జెట్లు ఎటాక్ ల నుంచి కాపాడుకోవడానికి మోడ్రన్ వెపన్స్ తప్పనిసరి అని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అమెరికాలో ఆయుధాల కోసం షాపింగ్ కు వెళ్లాడు. దీంతో అక్కడి కాంగ్రెస్ భయపడింది. ఈ కుర్రోడు గల్ఫ్ దేశాలను ఎక్కడ అస్థిరపరుస్తాడోనని జంకింది. నాటి ‘ అసిస్టెంట్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ’ రిచర్డ్ క్లార్క్ , లా మేకర్స్ ను అలర్ట్ చేశాడు. కానీ.. పెంటగాన్ వర్గాలు వీటిని పట్టించుకోలేదు. అప్పుడే గల్ఫ్ దేశాల్లో తమకంటూ ఒక మిత్ర దేశం కోసం వెతుకుతున్న అమెరికా, మహ్మద్ బిన్ జాయెద్ రూపంలో యూఏఈని నమ్మకమైన భాగస్వామిగా గుర్తించింది. బ్రిటిష్ ట్రైన్డ్ హెలికాప్టర్ పైలట్ అయిన ‘ఎంబీజెడ్’ కూడా తాను తొందరపాటు మనిషిని కాదని, సీరియస్ పర్సన్‌నని నిరూపించుకున్నారు. ఈ క్రమంలో 30 ఏళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం మహ్మద్ బిన్ జాయెద్.. యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌లో ఒకటైన అబుదాబికి ప్రిన్స్ . యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సాయుధ బలగాలకు డిప్యూటీ సుప్రీం కమాండర్. ఒకరకంగా ఎమిరేట్స్ కు ప్రెసిడెంట్ జాయేదే అనే పేరొచ్చింది. కొన్ని సార్లు డీ ఫాక్టో రూలర్ గా ఈయనే వ్యవహరిస్తున్నారు. విదేశీ విధానాల్లో యూపీఈ దూసుకుపోతోందంటే వాటికి కర్త, కర్మ, క్రియ మహమ్మద్ బిన్ జాయెదే కావటం కారణం. వాషింగ్టన్ లో గల్ఫ్ వాయిస్ ను గట్టిగా వినిపిస్తున్న విదేశీ నాయకుల్లో ఈయన కూడా ఒకరు. చాలా విషయాల్లో తమ విధానాలను అమెరికా కూడా అనుసరించాలని బలంగా కోరుతున్నారు.
ఎంబీజెడ్ కొత్త ట్రెండ్
దాదాపు మూడు దశాబ్దాలుగా అమెరికాకు మహ్మద్ బిన్ జాయెద్ కీలకమైన స్నేహితుడిగా కొనసాగుతున్నారు. ప్రపంచంపై పెద్దన్న పెత్తనాన్ని బేషరతుగా ఓకే చేస్తూనే సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు అమెరికాను ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా తన దారి తాను చూసుకుంటున్నారు. యెమెన్, లిబియా, సోమాలియా, ఈజిప్ట్‌లోని నార్త్ సినాయ్‌లో తన ప్రత్యేక బలగాలను యాక్టివ్‌గా మోహరించారు. తద్వారా ఈజిప్ట్‌లో ప్రభుత్వం మారకుండా చేశారు.. సౌదీ అరేబియాలో తనకు అనుకూలంగా ఉండే నాయకుడికి అధికారం దక్కేలా చక్రం తిప్పారు.
మిలటరీ కింగ్ యూఏఈ
మిలటరీపరంగా అరబ్ ప్రపంచాన్ని అబ్బురపరిచేలా యూఏఈని ఎంబీజెడ్ తీర్చిదిద్దారు. ఆయుధాల విషయంలో తనకుతానే సాటి అని చాటుకునేలా చేశారు. సైనిక కార్యకలాపాలకు సంబంధించి అమెరికాతో కలిసి తమ సరిహద్దుల్లో హైటెక్ సర్వైలెన్స్‌ని, కంబాట్ ఆపరేషన్స్‌ని ఎమిరేట్స్ చేపడుతోంది. మహ్మద్ బిన్ జాయెద్ మిలిటరీ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నారు. ఎమిరేట్స్ అనేది ఏడు రాజ్యాల కూటమి. దీనికి అబుదాబి రాజధానిగా వ్యవహరిస్తోంది. ఈ ఫెడరేషన్‌లో అబుదాబీతోపాటు అజ్మన్, దుబాయి, ఫజైరా, రస్ అల్ ఖైమా, షార్జా, ఉమ్ అల్ క్వాయిన్‌లున్నాయి. తన పెద్దన్న, ఎమిరేట్స్‌కి ప్రెసిడెంట్ అయిన ఖలీఫా బిన్ జయెద్ అనారోగ్యం వల్ల ఆయన బాధ్యతలను కూడా ఎక్కువ శాతం ఎంబీజెడ్ చూస్తున్నారు. ఎమిరేట్స్ సుల్తాన్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కి ఎంబీజెడ్ (58) సవతి తమ్ముడు. రాచరికపు వ్యవహారాలు, మిలటరీ వ్యూహాలు వగైరాలు పక్కనబెడితే ఎంబీజెడ్‌కి ఆసక్తికరమైన అంశం మరొకటి ఉంది. అంతరించిపోతున్న జీవ జాతులు, మొక్కల పరిరక్షణకు ఆయన కృషి చేస్తున్నారు. దీనికోసం తన పేరుమీద మహమ్మద్ బిన్ జాయెద్ స్పీషీస్ కన్జర్వేషన్ ఫండ్‌ని ఏర్పరిచారు. ఈ రంగంలో పనిచేసేవారిని గుర్తించి ప్రోత్సహిస్తుంటారు. ప్రకృతి, పర్యావరణం అనే అంశాలను బ్రాడ్‌గా చూడాలన్నది ఎంబీజెడ్ ఉద్దేశం. ఈ ఫండ్ ద్వారా వివిధ దేశాల్లో అంతరించిపోతున్న జీవజాలానికి సంబంధించి అన్వేషణ సాగుతోంది. పెరూ జాతీయ పార్కులో అరుదైన జాతికి చెందిన తొండను కనుగొని ‘ఎన్యాలియోడ్స్ బిన్‌జాయెదీ’గా పేరు పెట్టారు. అలాగే, 2017లో పశ్చిమ మెక్సికోలోని పర్వత ప్రాంతపు అడవుల్లో అత్యంత అరుదైన మొక్కను కనుగొన్నారు. దానిని ‘ఏసర్ బిన్‌జాయెదీ’గా పిలువసాగారు. స్వయంగా తొమ్మిదిమంది పిల్లలకు తండ్రయిన ఎంబీజెడ్ బాలల వైద్య ఆరోగ్య విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఎనిమిదేళ్లుగా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి అయిదు లక్షల డాలర్లతో అఫ్ఘాన్, పాకిస్థాన్ దేశాలకు టీకా మందును సరఫరా చేయిస్తున్నారు.
ట్రంప్కు జిగ్రీ దోస్త్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో మంచి జాయెడ్ మంచి ర్యాపో మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఖతార్, లిబియా, సౌదీల విషయంలో తన ఆలోచనల ప్రకారమే అగ్రరాజ్యం నడచుకునేలా చేశారు. ఇరాన్, ముస్లిం బ్రదర్హుడ్ అనే శత్రువులతో ఇబ్బంది పడుతున్న మహ్మద్ బిన్ జాయెద్, వాటి పని పట్టడంలో తనకు సహకరించాలని ట్రంప్‌ని కోరారు. దానికి ఆయన సరే అన్నారు. సౌదీ అరేబియా, యూఏఈలకు ఆయుధాలు అమ్మడానికి అడ్డుగా ఉన్న చట్టాల్ని మార్చేలా అమెరికా ప్రెసిడెంట్ గత వారమే చర్యలు తీసుకున్నారు. తద్వారా జాయెద్ ను అగ్రరాజ్యం తన బెస్ట్ ఫ్రెండ్ గా ట్రీట్ చేసినట్లయింది. దీనికి ప్రతిగా పశ్చిమాసియాలో అమెరికా చెయ్యమన్న పనిని ఎమిరేట్లు చేసి పెడతాయన్నమాట.