క్షిపణి దాడిని తిప్పికొట్టిన అబుదాబి

అబూదాబిపై మరోసారి ఎటాక్ జరిగింది. ఇటీవలే అక్కడి విమానాశ్రయంపై డ్రోన్లతో దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశంపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. అయితే ఈ దాడిని అబుదాబీ సమర్థంగా అడ్డుకున్నట్లు యూఏఈ వెల్లడించింది. ఇది హౌతీ తిరుగుబాటుదారుల పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడి ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ ప్రకటించింది. 

రాజధాని నగరమైన అబుదాబి లక్ష్యంగా ఈ క్షిపణి దాడి జరిగిందని డబ్ల్యూఏఎం న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. క్షిపణులు అబుదాబి నగరం అవతల పడిపోయాయని స్పష్టం చేసింది. క్షిపణి దాడి వల్ల అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్లే రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంట తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు, దాడికి సంబంధించినవిగా పేర్కొంటున్న పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దాడికి ఇంతవరకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే, అబుదాబి విమానాశ్రయంలో ఇటీవల డ్రోన్ దాడులకు పాల్పడ్డ హౌతీ తీవ్రవాదులే ఈ క్షిపణులను ప్రయోగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి: 

ఒమిక్రాన్​ కమ్యూనిటీ స్ప్రెడ్​ మొదలైంది

కరోనా పేషంట్లకు షాక్.. కొత్త టెస్ట్ పేరుతో దోపిడీ