ఈ రోజుల్లో ఆఫీస్, షాపింగ్ లేదా బయటికి వెళ్లేందుకు ఆన్లైన్లో ఆటో లేదా క్యాబ్ బుక్ చేస్తున్నారు చాలామంది. అలా ఎప్పటిలానే ఉబర్ క్యాబ్ బుక్ చేసిన ఢిల్లీ, గుర్గావ్లోని కొంతమందిఎప్పటికీ గుర్తుండిపోయే జర్నీ చేశారు. వాళ్లను పికప్ చేసుకునేందుకు క్యాబ్ డ్రైవరగా వెళ్లి, సర్ప్రైజ్ చేశాడు ఆ కంపెనీ ఇండియా సీఈవో ప్రభ్‌జీత్ సింగ్. ప్రైమరీ రీసెర్చ్‌లో భాగంగా తమ కంపెనీ డ్రైవర్ల పనితీరు, కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ తెలుసుకునేందుకు ఆయన ఈ స్పెషల్ రైడ్ చేపట్టారు. డ్రైవర్ సీట్లో ఉన్న ప్రభ్జీత్ని చూసి మొదట నమ్మలేదు వాళ్లు. ఆయనే ఉబర్ ఇండియా సీఈవో అని కన్ఫామ్ చేసుకున్నాక ప్రభ్జీత్తో సెల్ఫీలు దిగారు. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఆ ఫొటోలు చూసిన కొందరు ‘బాస్ అంటే ఇలా ఉండాలి’ అని కామెంట్లు పెడుతున్నారు.
మర్చిపోలేని ఎక్స్‌పీరియెన్స్
‘‘నేను ఆఫీస్‌కి వెళ్లేందుకు ఉబర్ బుక్ చేశాను. వెంటనే డ్రైవర్ ఫోన్ చేసి, ‘వస్తున్నాను మేడమ్’ అని చెప్పాడు. కారు ఎక్కగానే.. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి ‘హాయ్ మధువంతి. నేను ఉబర్ ఇండియా సీఈవోని. ఈరోజు మీరే నా మొదటి ప్యాసింజర్. మీకు ఈ రైడ్ ఇష్టమేనా?’ అని అన్నాడు” అని చెప్పింది మధువంతి సుందరరాజన్ అనే ప్యాసెంజర్. మరో ప్యాసెంజర్ అనన్యా ద్వివేది
తన ఎక్స్‌పీరియెన్స్ షేర్ చేసుకుంది... ‘‘చాలా రోజుల తర్వాత ఆఫీస్‌కి వెళ్లేందుకు నేను ఉబర్ క్యాబ్ బుక్ చేశాను. కారు ఎక్కగానే... డ్రైవర్ సీట్లో ఉన్న ఉబర్ ఇండియా సీఈవో ప్రభ్‌జీత్ సింగ్నన్ను పలకరించారు. గూగుల్లో చూశాక గానీ ఆయనే ఉబర్ సీఈవో అని నమ్మలేదు” అని చెప్పింది అనన్య.