క్యాబ్, ఆటో, బైక్, ఫుడ్డు.. ఏది బుక్ చేయాలన్నా వెంటనే గుర్తొచ్చే యాప్‌లలో ఉబర్ ఒకటి. ప్రపంచంలోని దాదాపు సగం దేశాల్లో ట్రాన్స్పోర్ట్ సర్వీసులు అందిస్తోంది. ట్రిప్పులు ఏటా భారీగా పెరుగుతున్నాయి. అదే సమయంలో బ్యాడ్ ఫీడ్బ్యాకూ వస్తోంది. లేటెస్ట్గా ఆ సంస్థ నుంచి కో–ఫౌండర్ ట్రావిస్ కలానిక్ తప్పుకున్నారు. కాంట్రవర్సియల్ వ్యాపార విధానాలు అమలుచేస్తున్నారనే ఆరోపణలతో ఆయన్ని ఉబర్ నుంచి వెళ్లిపోవాలంటూ ఇన్వెస్టర్లు ఒత్తిడి చేశారు.
ఓలా, ఉబర్ సర్వీసులతో ఆటో డ్రైవర్ల ఆగడాలకు చెక్ పడిందని చెప్పొచ్చు. గతంలో వాళ్లు చెప్పిందే వేదం. వాళ్లు చేసిందే బేరం. కిరాయి విషయంలో కిరాతకంగా ఉండేవారు. రూపాయి తగ్గినా తీసుకునేవారు కాదు. చెప్పిన చోట కన్నా అడుగు ముందుకు వచ్చేవారు కాదు. వచ్చినా ఎక్స్ట్రా డబ్బు కోసం సతాయించేవారు. యాప్ బేస్డ్ రవాణా సేవల రాకతో ఈ రంగం మారిపోయింది. మనం ఎక్కడుంటే అక్కడికొచ్చి పికప్ చేసుకుంటున్నారు. ఏసీ వేస్తారు. ఛార్జీ విషయంలో పేచీ ఉండదు. డ్రైవర్ ప్రవర్తనపై ఫీడ్‌బ్యాక్ ఇచ్చే అవకాశమూ ఉంది. అంచనాలకు తగ్గ సేవలందిస్తూ రైడ్ షేరింగ్ సంస్థలు కస్టమర్ల ఆదరణ పొందుతున్నాయి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా మొదలైన ఉబర్ సర్వీసులు పదేళ్లలోనే 70 దేశాలకు పాకాయి. ఒక్క యూఎస్‌లోనే డైలీ 4 లక్షల ట్రిప్పులు తిరుగుతున్నాయి. 2017లో ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల ట్రిప్పులు నమోదు కాగా ఆ సంఖ్య 2018లో 130 కోట్లకు పెరిగింది. మంచి ఉన్న చోట చెడూ ఉంటుంది కదా. అలాగే ఈ ఫీల్డ్‌లోకీ నకిలీ డ్రైవర్లు ఎంటరయ్యారు. ఉబర్ యాప్ ద్వారా ఫేక్ బుకింగ్‌లు పొందుతూ రైడర్లను ఇబ్బంది పెట్టసాగారు.
సేఫ్టీ టీమ్‌ను మూడు రెట్లు పెంచినా..
క్యాబ్ ఎక్కినోళ్లను డ్రైవర్లు మాటలు, చేతలతో చిరాకు పెడుతున్నారు. లైంగిక వేధింపులకూ గురిచేస్తున్నారు. దీంతో ఉబర్ కంపెనీ.. సేఫ్టీని కట్టుదిట్టం చేసింది. సేఫ్టీ టీమ్ సభ్యుల సంఖ్యను 2017లో మూడు రెట్లు చేసింది. యాప్‌లో ‘ఎమర్జెన్సీ బటన్’ ఫీచర్‌ని యాడ్ చేసింది. డ్రైవర్ల బ్యాక్‌గ్రౌండ్‌ను లోతుగా పరిశీలించాకే బుకింగ్‌లు కేటాయిస్తోంది. దీంతో లండన్‌లో ఈ సంస్థ ఆపరేటింగ్ లైసెన్స్‌ని తొలిసారిగా గతేడాది క్యాన్సిల్ చేశారు. ఈ నేపథ్యంలో ఉబర్ తన బిజినెస్ మోడల్లో చెప్పుకోదగ్గ మార్పులు చేసి 15 నెలలకు ప్రొబేషనరీ లైనెన్స్ పొందింది. ఆ తర్వాత కూడా సేఫ్టీ విషయంలో ఫెయిల్యూర్ అవుతూ ఉండటంతో లండన్ రవాణా సర్వీసుల రెగ్యులేటరీ (ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్–టీఎఫ్ఎల్) అసంతృప్తి వ్యక్తం చేసింది.
రెండేళ్లలో ఇది రెండోసారి
ఉబర్ లైసెన్స్‌ని లండన్ ట్రాన్స్పోర్ట్ విభాగం క్యాన్సిల్ చేయటం గడచిన రెండేళ్లలో ఇది రెండోసారి. ఈ సిటీలో ఉబర్‌కి రఫ్‌గా 45 వేల మంది డ్రైవర్లు ఉన్నారు. వాళ్ల క్రిమినల్ నేరాలను, బ్యాక్‌గ్రౌండ్ వివరాలను ఆ సంస్థ తమకు ఇవ్వకపోవటంపై టీఎఫ్ఎల్ 2017 నుంచే సీరియస్‌గా ఉంటోంది. ఈ కారణంతోనే ఆ సంవత్సరం ఉబర్ లైసెన్స్‌ని రెన్యువల్ చేసేందుకు ఒప్పుకోలేదు. యాప్‌లో చాలా మార్పులు చేయటంతోపాటు టీఎఫ్ఎల్ నిర్ణయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి 15 నెలల కాలానికి టెంపరరీ రెన్యువల్ చేయించుకున్నారు. ఆ గడువు సెప్టెంబర్‌లో ముగియటంతో మళ్లీ రెండు నెలలు పొడిగించుకున్నారు. రైడ్ షేరింగ్, ఇన్సూరెన్స్, డ్రైవర్ల డాక్యుమెంట్ల చెకింగ్ వంటి అంశాల్లో కఠినమైన కండిషన్లకు ఓకే అంటేనే ఎక్స్టెండ్ చేస్తామని తేల్చిచెప్పి టీఎఫ్ఎల్ అనుకున్నది సాధించింది. ఉబర్ సిస్టమ్‌లో జరిగిన మార్పులను ఫేక్ డ్రైవర్లు అనుకూలంగా మలచుకున్నారు. అసలు డ్రైవర్ల ఫొటోలకు బదులు వాళ్ల ఫొటోలు అప్లోడ్ చేసి దాదాపు 14 వేల రైడ్లు పొందడంతో ఉబర్ చిక్కుల్లో పడింది.