
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు వైసీపీ ఎమ్మెల్యేలు పాల్పడటంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేశారన్న ఆరోపణలతో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను వైసీపీ సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఉదయగిరికి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హల్ చల్ చేశారు. వైసీపీ నేతలకు బస్తీమే సవాల్ అంటూ ఉదయగిరి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చు్న్నారు. కొద్దిరోజులుగా తనకు సవాల్ విసురుతున్న వైసీపీ నేతలకు ..రండి చూసుకుందాం అంటూ మేకపాటి ప్రతిసవాల్ విసిరారు.
ఉదయగిరిలో ఉద్రిక్తత..
ఉదయగిరికి వస్తే తరిమికొడతామన్న వాళ్లు రావాలంటూ పట్టణంలోని బస్టాండ్ సెంటరులో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుర్చీ వేసుకుని కూర్చుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి భారీగా తరలిరావడంతో పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఎమ్మెల్యే దగ్గరకు చేరుకున్న పోలీసులు..పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
ఎవరొస్తారో రండి.. తరిమికొట్టండి
మార్చి 30వ తేదీన ఉదయం మర్రిపాడు నుంచి ఉదయగిరి చేరుకున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. మీడియా సమావేశం నిర్వహించారు. తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. కానీ వైసీపీ అధిష్ఠానం మాత్రం తనపై అభాండాలు వేసి అన్యాయంగా సస్పెండ్ చేసిందని తెలిపారు. తనపై పార్టీ అధిష్టానానికి అసత్యాలు చెప్పారని.. కొందరు నాయకులు తనపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. జనం ఆదరణతోనే ఎమ్మెల్యేగా ఉన్నానని..ఇప్పుడు ఎవరొస్తారో రండి.. తరిమికొట్టండి అని సవాల్ విసిరారు.
ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారని వైసీపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి వైసీపీ నేతలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈక్రమంలో మేకపాటి ఉదయగిరికి వస్తే తరిమికొడతామంటూ ఉదయగిరికి చెందిన వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డితో పాటు..ఆయన వర్గం నేతలు హెచ్చరించారు. పార్టీకి ద్రోహం చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలంటూ మార్చి 30వ తేదీన ప్లకార్డులతో ఉదయగిరిలో ర్యాలీ నిర్వహించారు. దీంతో ఉదయగిరి బస్టాండ్ సెంటర్కు వచ్చిన మేకపాటి..అక్కడే కుర్చీ వేసుకుని దమ్ముంటే రావాలని ప్రతిసవాల్ విసిరారు.