
ముంబై: మహారాష్ట్రలో ఏండ్ల నుంచి దూరం దూరంగా ఉన్న ఠాక్రేలను ఇప్పుడు భాషా వివాదం ఒకటి చేయనుందా?! ఇద్దరు ఠాక్రేల మాటలు వింటుంటే ఔననే సమాధానం వస్తున్నది. తమకు మహారాష్ట్ర సంస్కృతి, భాష, సంప్రదాయాలు ముఖ్యమని.. వాటి కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఇటు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేతోపాటు అటు శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే వేర్వేరు కార్యక్రమాల్లో ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి దూరం దూరంగా ఉంటున్న ఈ అన్నదమ్ముల పిల్లలు ఇప్పుడు మళ్లీ మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటయ్యేందుకు రెడీ అనే సంకేతాలు ఇచ్చారు.
వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి మహారాష్ట్రలో జాతీయ విద్యావిధానం–2020తోపాటు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మరాఠీ, ఇంగ్లిష్ మీడియంలో థర్డ్ ల్యాంగ్వేజ్‌గా హిందీని తప్పనిసరి చేయనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై శివసేన (యూబీటీ) తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నది. హిందీని తప్పనిసరి చేయడం వల్ల మరాఠీ సంస్కృతికి విఘాతం కలుగుతుందని అంటున్నది.
ఎవరేమన్నారంటే..?
మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాల ముందు ఉద్ధవ్‌కు, తనకు మధ్య ఉన్న విభేదాలు చాలా చిన్నవని పాడ్ క్యాస్ట్‌లో రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా మరాఠా సంస్కృతికి తాము కలిసి పనిచేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. 2005లో శివసేన నుంచి విడిపడి తాను మహారాష్ట్ర నవనిర్మాణ సేన స్థాపించినప్పుడు ఉన్న పరిస్థితులను ఆయన పంచుకున్నారు. తాను బాల్ ఠాక్రే తప్ప ఎవరి కిందా పనిచేయలేనని, ఒంటరిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకొని ఎంఎన్ఎస్ను ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు. మహారాష్ట్ర ప్రజలకు, మరాఠా సంస్కృతికి విఘాతం కలుగుతున్నప్పుడు పోరాడేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని.. ఇప్పుడు ఈ విషయంలో ఉద్ధవ్‌తో కలిసి నడిచేందుకు అభ్యంతరంలేదని రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు.
తన ప్రజల కోసం చిన్నపాటి పంచాయితీలను పక్కనపెట్టడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని భారతీయ కామగార్ సేన సమావేశంలో శివసేన (యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ‘‘మహారాష్ట్రకు కష్టకాలం వచ్చినప్పుడు ఇక్కడి వారంతా కలిసి కట్టుగా ఎదుర్కోవాల్సిందే. ఆ పోరాటంలో మేం ముందుంటాం. ఇండస్ట్రీలను గుజరాత్‌కు తరలించుకుపోతున్నారని నేను ప్రశ్నించినప్పుడే అందరం ఒక్కటైతే సమస్య ఉండేది కాదు. మహారాష్ట్ర కోసం పనిచేసే ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసేవాళ్లం. ఇప్పటికైనా మించిపోయింది లేదు” అని వ్యాఖ్యానించారు.