
మహారాష్ట్రలో హిందీభాషను తప్పనిసరి చేయడంపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. హిందీతో ఎటువంటి సమస్యా లేదని.. ఆ భాషను బలవంతంగా రుద్దడమే అసలు సమస్య అని అన్నారు. మరాఠీ, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో 1నుంచి 5 వరకు విద్యార్థులకు హిందీని మూడో భాషగా తప్పనిసరిగా బోధించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.
మహారాష్ట్రలో హిందీని తప్పనిసరి చేయడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అన్నారు. హిందీ పట్ల మాకు అభ్యంతరం లేదు.. కానీ బలవంతంగా ఎందుకు రుద్దుతున్నారని అన్నారు.
శివసేన-యుబిటి ఎంపీ సంజయ్ రౌత్ కూడా పాఠశాలల్లో హిందీ భాష తప్పనిసరిని వ్యతిరేకించారు. మరాఠీ రాష్ట్ర భాష అని ఇక్కడ హిందీ నేర్పించాల్సిన అవసరం లేదని రౌత్ అన్నారు. ఫడ్నవీస్ భాషా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.