ఉద్ధవ్ థాక్రే రాజకీయ చరిత్ర..

శివసేనాని ఇప్పుడు…మహా సేనాని

‘ స్లో అండ్ స్డడీ విన్స్ ది రేస్ ’ అనే ఇంగ్లీషు నానుడి ఉద్ధవ్ థాక్రే వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపోతుంది. ఉద్ధవ్ ను బిడియస్తుడు, ఇంట్రావర్ట్ అంటారు ఆయన చిన్న నాటి ఫ్రెండ్స్. పెద్ద వాడై, రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి వచ్చినా ఆయనలో పుట్టుకతో వచ్చిన ఈ లక్షణాలు పోలేదు. అయితే కూల్ గా ఉంటూనే సమర్థుడన్న పేరు తెచ్చుకున్నారు. శివసేనకు కొత్త డైరక్షన్ ఇచ్చారు. పార్టీని మరింతగా ప్రజల దగ్గరకు తీసుకెళ్లారు.

పొలిటికల్ సర్కిల్స్ లో ‘టాస్క్ మాస్టర్’ గా ఉద్ధవ్ థాక్రేకు పేరు. ఆయన మొదటి నుంచి ఆర్భాటాలకు దూరం. తండ్రి బాల్ థాక్రే ఏ పని అప్పగించినా  సైలెంట్ గా ఆ పని పూర్తి చేసేవారు. ఫలానా పని తానే చేశానని కూడా ఎవరికీ చెప్పుకునేవారు కాదు. బాలాసాహెబ్  థాక్రే 2012లో చనిపోయేంతవరకు ఆయన కనుసన్నల్లోనే శివసేన నడిచింది. అయితే ఆయన అనారోగ్యానికి గురైన తరువాత పార్టీని నడపడంలో తండ్రికి ఉద్ధవ్ సాయం చేసేవారు. పార్టీ వ్యవహారాల్లో  చివరి నిర్ణయం బాల్ థాక్రేది అయినా ఉద్ధవ్ మాటకు ఆయన విలువ ఇచ్చేవారు. దాదాపుగా ప్రతి కీలక నిర్ణయం తీసుకునేముందు కొడుకు ఉద్ధవ్ సలహాలు, సూచనలు బాల్ థాక్రే తీసుకునేవారు.

మాటలు తక్కువ – వినడం ఎక్కువ

ఉద్ధవ్ థాక్రే కు తండ్రి లాగ  అద్భుతమైన వాగ్దాటి లేదు. మాటలను ఈటెలుగా వాడుకునే విద్య ఆయనకు తెలియదు. అయితే ఆయన మంచి శ్రోత. ఎవరేం చెప్పినా చాలా శ్రద్ధగా వింటారు. పార్టీ సమావేశాల్లో సామాన్య కార్యకర్త మాట్లాడినా  కూల్ గా వినేవారు. కార్యకర్తలు చెప్పినదాంట్లో మంచి పాయింట్ ఉందనిపిస్తే అక్కడికక్కడే నోట్ చేసుకునేవారు. మీటింగ్ అయిపోయిన తరువాత ఆ పాయింట్ల మీద కసరత్తు చేసేవారు.

బీఎంసీ గెలుపుతో…

బాల్ థాక్రే హెల్త్ దెబ్బతిన్న తరువాత శివసేన వ్యవహారాలను దాదాపుగా ఉద్ధవ్ నే చూడటం మొదలెట్టారు.ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడం అనేది మహారాష్ట్రలోని చాలా రాజకీయ పార్టీలకు ఒక డ్రీమ్. శివసేనకు కూడా ఆ కల ఉండేది. 2002లో శివసేన ‘బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ’ (బీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. ఈ గెలుపుతో ఉద్దవ్ లోని లీడర్ షిప్ క్వాలిటీస్ తొలిసారిగా బయటపడ్డాయి. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున ఉద్ధవ్ చీఫ్ క్యాంపెయినర్ గా పనిచేసి అందరి దృష్టిని  ఆకట్టుకోగలిగారు. ఆ తరువాత 2012లో కూడా ఆయన నాయకత్వంలో బీఎంసీ లో శివసేన పాగా వేసింది.

2003లో ఉద్ధవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టిన తరువాత  పార్టీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీ వ్యవహారాలపై ఆయన పట్టు మరింతగా పెరిగింది. ‘మీ ముంబైకర్ (నేను ముంబైకు చెందినవాడిని)’ అంటూ ఉద్ధవ్ మొదలెట్టిన ఉద్యమంతో శివసేన ప్రజలకు బాగా దగ్గరైందంటారు ఎనలిస్టులు.

సమర్థత చాటుకున్న ఉద్ధవ్

ఉద్ధవ్ థాక్రే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేనాటికి పార్టీలో  హేమాహేమీలు ఉండేవారు. నారాయణ్ రాణే,  రాజ్ థాక్రే  (పెదనాన్న కొడుకు) వీరిలో ముఖ్యులు.ఉద్ధవ్ కు అంత పెద్ద పోస్టు ఇవ్వడం వీరికి ఇష్టముండేది కాదట. దీంతో పార్టీలో మెల్లమెల్లగా గొడవలు మొదలయ్యాయి. ఉద్ధవ్ చెప్పిన దానికి వీళ్లు అడ్డుపుల్లలు వేసే వారని అంటారు. అయినా ఉద్ధవ్ ఇవన్నీ పట్టించుకోకుండా  తన పని తాను చేసుకుపోతుండే వారు. మెల్లమెల్లగా పార్టీ పై పట్టు సాధించారు.కార్యకర్తల మద్దతు కూడా ఉద్ధవ్ కే ఉండేది. దీంతో ఉద్ధవ్ ఆధిపత్యాన్ని సహించలేక నారాయణ్ రాణే, రాజ్ థాక్రే ఆ తరువాత పార్టీ ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. ఎత్తుగడలు వేయడం, వ్యూ హాలు పన్నడంలో  కూడా ఉద్ధవ్ థాక్రే  ఘటికుడే అంటారు పొలిటికల్ ఎనలిస్టులు. రాజకీయంగా ఎప్పుడు  ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయనకు తెలిసినంతగా మరో మహారాష్ట్ర లీడర్ కు తెలియదంటారు ఆయన గురించి తెలిసిన వాళ్లు. బీజేపీతో కొంతకాలంగా శివసేనకు మంచి సంబంధాల్లేవు. అయినప్పటికీ పార్టీ మరింత ఎదగాలనే ఉద్దేశంతోనే లేటెస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకుంది ఉద్ధవే అంటారు రాజకీయ విశ్లేషకులు.

అన్ని వర్గాలను కలుపుకుని పోయే ప్రయత్నాలు

ఉద్ధవ్ థాక్రే హయాంలో శివసేన ఒక పరిణతి చెందిన రాజకీయ పార్టీగా అవతరించింది. అన్ని వర్గాలను కలుపుకుని పోయే పొలిటికల్ పార్టీగా  కొత్త రూపు సంతరించుకుంది. బాల్ థాక్రే హయాంలో శివసేన మరాఠా కమ్యూనిటీకే పరిమితమైన పార్టీగా ఉండేది. బతుకుదెరువు కోసం ముంబై సిటీకి వచ్చిన ఉత్తరాది వాళ్లు శివసేనకు దూరంగా ఉండేవాళ్లు. శివసేన పై నార్త్ ఇండియన్ల కు వ్యతిరేకమన్న ముద్ర ఉండేది. ఈ ఇమేజ్  చెరిపేయడానికి ఉద్ధవ్ చాలా కష్టపడ్డారు. నార్త్ ఇండియన్లకు పార్టీని దగ్గర చేయడానికి ప్రయత్నించారు. కొడుకు ఆదిత్య థాక్రే ‘ఒర్లి’ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు అన్ని భాషల్లో హోర్డింగ్స్ పెట్టించారు. సౌత్ తో పాటు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వారు కూడా శివసేన లో వచ్చిన ఈ మార్పుకు ఫిదా అయ్యారు. అంతేకాదు దళితులకు దగ్గర కావడానికి ‘శివ్ శక్తి –భీమ్ శక్తి’ అంటూ ఓ కొత్త స్లోగన్ ఇచ్చారు. దళిత లీడర్ గా పేరున్న రాందాస్ అథవాలేతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు.

ఆర్గనైజేషనల్ స్కిల్స్ కు మారు పేరు

సంస్థాగత వ్యవహారాలు చక్కదిద్దడంలో ఉద్ధవ్ కు మంచి నైపుణ్యం ఉందని ఆయన గురించి బాగా తెలిసిన వాళ్లు అంటారు. ఆయన చుట్టూ ఎప్పుడూ పార్టీ కార్యకర్తలు ఉండేవారు. పార్టీ కోసం సిన్సియర్ గా పనిచేస్తున్న కార్యకర్తలను  ఆయన గుర్తు పెట్టుకునేవారు. కాలక్రమంలో వీరికి  నాయకులుగా ప్రమోషన్లు ఇచ్చేవారు. చిన్నా చితకా నాయకుల విషయంలో కూడా ఇదే పద్దతి ఫాలో అయ్యేవారు. పార్టీకి ఫలానా లీడర్ అవసరం ఉందని భావిస్తే వాళ్లను కీలక పదవుల్లో నియమించేవారు. వారితో  పనిచేయించుకునేవారు. ఉద్ధవ్ కున్న ఈ లక్షణం వల్లనే 2006లో రాజ్ థాక్రే పార్టీ నుంచి బయటకు వెళ్లి ‘మహారాష్ట్ర నవనిర్మాణ సేన’ ( ఎంఎన్ఎస్) పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు మెజారిటీ కార్యకర్తలు, నాయకులు  శివసేనలోనే కొనసాగారు.

తొలిరోజుల్లో ‘శివసేన రాహుల్’ ఇమేజ్ 

ఉద్ధవ్ థాక్రేకు తొలి రోజుల్లో ‘శివసేన రాహుల్ గాంధీ’ అనే ఇమేజ్ ఉండేది. కాంగ్రెస్ లో  రాహుల్ కు తల్లి చాటు కొడుకని పేరు ఉన్నట్టే  శివసేనలో ఉద్ధవ్ పై అలా తండ్రి చాటు కొడుకు అనే ముద్ర ఉండేది. ఈ ఇమేజ్ నుంచి బయటపడటానికి ఉద్ధవ్  చాలా కష్టపడాల్సి వచ్చింది. పార్టీ వ్యవహారాలకు సంబంధించి సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేది. అంతేకాదు తీసుకున్న నిర్ణయాలకు పార్టీలో అందరి ఆమోదం ఉండేలా చూసుకునేవారు.

శివసేనకు కొత్త రూపు

శివసేనకు ఒకప్పుడు మిలిటెంట్ ఆర్గనైజేషన్ అనే ముద్ర ఉండేది. ఉద్ధవ్ థాక్రే ఈ ఇమేజ్ ను పూర్తిగా మార్చేశారు. మహారాష్ట్ర కోసం, మహారాష్ట్ర ప్రజల కోసం పనిచేసే ఒక రాజ కీయ పార్టీగా శివసేనను మలిచారు. తండ్రి బాల్ థాక్రే లాగ కాకుండా ఫైర్ బ్రాండ్ పాలి టిక్స్ కు దూరంగా ఉన్నారు.మహారాష్ట్ర అనేది ఎప్పుడూ  ప్రశాంతంగా ఉండాలన్న ఉద్దేశంతో పార్టీని ఆ దిశగా మళ్లించారు. పార్టీకి కొత్త రూపు ఇచ్చారు. ఒక రకంగా శివసేన పార్టీ ఐడియాలజీని మార్చి పొలిటి కల్ పార్టీగా మాత్రమే దానిని చూసేటట్లు చేశారు. అయితే శివసేన మూలాలు మరచిపోలేదు. హింస నీడ పడకుండా కాపాడుకుంటూ అసలు సిసలు రాజకీయ పార్టీగా శివసేనను మార్చారు.

ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం

తండ్రిలాగ ఉద్ధవ్​ కూడా కార్టూనిస్టే. అయితే కార్టూన్లు వేయడం పై ఆయన పెద్ద గా ఇంట్రెస్ట్ చూపలేదు. ఫొటోగ్రఫీ పై ఉద్ధవ్ ఆసక్తి పెంచుకున్నారు. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ ఆయన స్పెషలైజేషన్. ఏమాత్రం తీరిక దొరికినా ఫ్రెండ్స్ ను వెంటేసుకుని సిటీకి దూరంగా వెళ్లి  వన్య ప్రాణుల ఫొటోలు తీసేవారు. రాజకీయాల్లోకి రాకపోతే ఉద్దవ్ మంచి ఫొటోగ్రాఫర్ అయి ఉండేవారంటారు ఆయన ఫ్రెండ్స్.

సలహాదారులు ఎవరంటే

ఉద్దవ్ థాక్రే చుట్టూ ఎప్పుడూ  ఓ సలహాదారుల టీం ఉంటుంది. భార్య రష్మి ఎప్పటికప్పుడు రాజకీయాలపై  అప్ డేట్ అవుతుంటారు. అవసరమైనప్పుడు ఉద్ధవ్ కు సలహాలు ఇస్తుంటారు. రష్మి ఒక్కరే కాదు కొడుకులు ఆదిత్య, తేజస్  కూడా పాలిటిక్స్ ను బాగా ఫాలో అవుతుంటారు. సలహాదారుల టీంలో కుటుంబం తరువాత పార్టీ లీడర్లకు చోటు ఉంటుంది. సంజయ్ రౌత్, సుభాష్ దేశాయ్, అనిల్ పరాబ్, అనిల్ దేశాయ్, మిలింద్ నర్వేకర్  వంటి నాయకులు ఈ టీంలో ఉంటారు. వీరందరూ ఒక్కో సబ్జెక్టులో నిష్ణాతులు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీరికి ఉద్ధవ్ బాగా విలువ ఇస్తారంటారు ఎనలిస్టులు.

‘సామ్నా’ లో ఘాటు  ఎడిటోరియల్స్

పార్టీ పనులతో బిజీగా ఉన్నా అన్ని పత్రికలను చదివేవారు ఉద్ధవ్. అంతేకాదు ఆయనకు రాయడమూ ఇష్టమే. ఉద్ధవ్ కు ఉన్న ఈ ఆసక్తిని గమనించి బాల్ థాక్రే, పార్టీ పత్రిక ‘సామ్నా’ కు ఎడిటర్ ఇన్ చీఫ్ గా నియమించారు. ఉద్ధవ్ హయాంలో ‘సామ్నా’ లో అనేక ఘాటు ఎడిటోరియల్స్ వచ్చాయి. అనేక కీలక అంశాలపై శివసేన  వైఖరి అందరికీ అర్థమయ్యేట్టు ఎడిటోరియల్స్ ఉండేవి.