బలపరీక్ష ఎదుర్కోకుండానే ఉద్ధవ్ రిజైన్ చేశారు: సుప్రీంకోర్టు

  • గవర్నర్ గా కోష్యారీ తీరు సమర్థనీయం కాదు
  • ఆయన నిర్ణయాలు.. షిండే వర్గానికి ఉపయోగపడ్డయ్
  • ఉద్ధవ్ మెజారిటీ కోల్పోయారని తప్పుగా నిర్ధారించారు
  • శివసేన వివాదంపై రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ‘శివసేన వర్సెస్ శివసేన’ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించలేమని స్పష్టంచేసింది. గతేడాది జూన్‌‌లో ఫ్లోర్ టెస్టును ఎదుర్కోకుండానే సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయడమే ఇందుకు కారణమని చెప్పింది. శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేసిన ఏక్‌‌నాథ్ షిండేను,15 మంది ఇతర ఎమ్మెల్యేలను డిస్‌‌క్వాలిఫై చేయలేమని తేల్చిచెప్పింది. నాడు మహారాష్ట్ర గవర్నర్‌‌‌‌గా ఉన్న భగత్‌‌సింగ్ కోష్యారీ తీసుకున్న నిర్ణయాలు.. షిండే వర్గానికి ఉపయోగపడ్డాయని వ్యాఖ్యానించింది. ఉద్ధవ్ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును కోల్పోయారంటూ తప్పుగా నిర్ధారణ చేశారని పేర్కొంది. గురువారం ఈ మేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా 141 పేజీల తీర్పు చెప్పింది.

షిండే వర్గంతో ప్రమాణం సమర్థనీయమే

మహారాష్ట్రలో ఏక్‌‌నాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయిన ఘటనకు సంబంధించి దాఖలైన 8 పిటిషన్లపై సుప్రీం కాన్‌‌స్టిట్యూషనల్‌‌ బెంచ్ విచారణ జరిపింది. ఉద్ధవ్ తరఫున సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ.. ఏక్‌‌నాథ్ షిండే వర్గం తరఫున హరీశ్ సాల్వే, నీరజ్ కౌల్, మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ఉద్ధవ్ బలపరీక్షకు ముందే రాజీనామా చేయకపోయుంటే.. ఆయన ప్రభుత్వాన్ని తాము పునరుద్ధరించే వాళ్లమని చెప్పింది. గత ఏడాది జూన్ 30న అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రేను నాటి మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ పిలవడం సమర్థనీయం కాదని తెలిపింది. ఈ కేసులో గవర్నర్ విచక్షణాధికారం చట్టానికి అనుగుణంగా లేదని అభిప్రాయపడింది. అయితే ఉద్ధవ్ అప్పటికే రాజీనామా చేయడంతో.. అత్యధిక సభ్యులు ఉన్న బీజేపీ మద్దతుతో షిండే వర్గంతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం సమర్థనీయమేనని చెప్పింది. అయితే, పార్టీల మధ్య ఉన్న వివాదాలను సెటిల్‌‌ చేసుకునేందుకు ఫ్లోర్‌‌‌‌ టెస్ట్‌‌ను మాధ్యమంగా ఉపయోగించరాదని స్పష్టం చేసింది. 

స్పీకర్​పై నిర్ణయం లార్జ్‌‌ బెంచ్‌‌కు  

స్పీకర్‌‌‌‌ను తొలగించాలనే నోటీసు పెండింగ్‌‌లో ఉన్నప్పుడు.. అనర్హత నోటీసులను సదరు స్పీకర్ జారీ చేయలేరని సుప్రీం చెప్పింది. ఇదే సమయంలో తనను తొలగించాలని ప్రవేశపెట్టిన తీర్మానం.. ప్రొసీజర్ ప్రకారం లేకుంటే అప్పుడు ఎమ్మెల్యేల డిస్‌‌క్వాలిఫికేషన్ పిటీషన్ల విషయంలో ముందుకు వెళ్లొచ్చని పేర్కొంది. 2022 జూన్‌‌లో శివసేన నుంచి 16 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసును మాత్రం విస్తృత ధర్మాసనానికి సుప్రీం రిఫర్ చేసింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌‌ ప్రకారం.. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న స్పీకర్‌‌‌‌కు.. రెబెల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు ఇచ్చే అధికారాలు ఉంటాయా? లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే, షిండే వర్గానికి చెందిన సభ్యుడిని శివసేన విప్‌‌గా నియమించాలని స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని చెప్పింది. పార్టీ నియమించిన విప్‌‌ను మాత్రమే స్పీకర్ పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. 

షిండే, ఫడ్నవీస్ రిజైన్ చేయాలి  

మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చేందుకు ప్రజాస్వామ్యాన్ని ఏక్‌‌నాథ్ షిండే ఖూనీ చేశారు. నా మాదిరే ఆయన కూడా సీఎం పదవికి రాజీనామా చేయాలి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఏక్‌‌నాథ్ షిండే గెలిచారు. షిండేకు, ఫడ్నవీస్‌‌కు నైతికత అనేది ఉంటే.. వాళ్లు రాజీనామా చేయాలి.  
–ఉద్ధవ్ థాక్రే, శివసేన (యూబీటీ) అధినేత

నాకు అనిపించిందే చేశాను 

నేనేమీ న్యాయ విద్యార్థిని కాదు. అప్పుడు నాకు  ఏది కరెక్ట్ అనిపించిందో అదే చేశాను. ఉద్ధవ్  థాక్రే సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత నేను చేయడానికి ఏముంటుంది? 
–భగత్ సింగ్ కోష్యారీ, మహారాష్ట్ర మాజీ గవర్నర్ 

మెజారిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి 

ప్రజాస్వామ్యంలో.. మెజారిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి. మేము ప్రభుత్వాన్ని చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేశామని సుప్రీంకోర్టు నిర్ణయం ద్వారా రుజువైంది. 
–ఏక్‌‌నాథ్ షిండే, మహారాష్ట్ర సీఎం 

అప్పుడు మీ నైతికత ఏమైంది? 

బీజేపీతో పొత్తు పెట్టుకుని మీరు ఎన్నికయ్యారు. కానీ కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు మీ నైతికత ఎటుపోయింది? అధికారం కోసం సిద్ధాంతాన్ని వదులుకున్నారు. కానీ షిండే తన పవర్‌‌‌‌ని వదులుకుని, సిద్ధాంతం కోసం ప్రతిపక్షంలో కలిశారు. 
–దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం