బీజేపీ, షిండేలను దూరంపెడ్తే ఇబ్బంది లేదు: శివసేన

బీజేపీ, షిండేలను దూరంపెడ్తే ఇబ్బంది లేదు: శివసేన

ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే బీజేపీతో పాటు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి దూరంగా ఉంటే ఉద్ధవ్‌‌తో ఎలాంటి వివాదం ఉండదని శివసేన (యూబీటీ) పేర్కొంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే త్వరలో కలవబోతున్నారని ఇటీవల శివసేన(యూబీటీ) పత్రిక సామ్నా తన సంపాదకీయంలో వెలువరించిన విషయం తెలిసిందే. కాగా, వారిద్దరూ మహారాష్ట్ర ప్రజల, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారని, అందువల్ల వారి మధ్య విభేదాలు పెద్దవి కావని సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.

బీజేపీ, షిండే సేనలు మహారాష్ట్ర వ్యతిరేక శక్తులుగా మారాయని, వారు బాల్​ఠాక్రే స్థాపించిన శివసేనను బలహీనపరిచారని, మరాఠీ ఐక్యతను దెబ్బతీశారని ఆరోపించింది. బీజేపీ, షిండే నేతృత్వంలోని సేన.. రాజ్ భుజాలపై తుపాకీ పెట్టి సేన (యూబీటీ)పై గురిపెట్టాయని, దీని వల్ల ఎంఎన్ఎస్​కు ప్రయోజనం చేకూరలేదని.. కానీ మరాఠీ ఐక్యతను దెబ్బతీసిందని పేర్కొంది. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల కలయిక మహారాష్ట్ర వ్యతిరేక శక్తులకు సరైన సమాధానంగా ఉంటుందని సామ్నా వెల్లడించింది.