
- వసతులు, టీచర్ల ఖాళీలు, మిడ్ డే మీల్స్ అమలుపై ఆరా
- సర్వే ఆధారంగా ఫండ్స్ కేటాయింపు
- స్కూళ్లలో సమాచారంపై తొలిసారి థర్డ్ పార్టీతో సర్వే
జగిత్యాల, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో పరిస్థితులపై హెడ్మాస్టర్లు, విద్యాశాఖ అధికారులు అందజేసిన వివరాలపై ప్రభుత్వం తొలిసారి థర్డ్ పార్టీ సర్వే చేయించింది. యుడైస్ ప్లస్(డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్) పేరిట స్కూళ్లలో వసతులు, టీచర్ల సంఖ్య, స్టూడెంట్స్ సంఖ్య తదితర వివరాలను సర్వేలో సేకరించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,289 స్కూళ్లను ఎంపిక చేసి సర్వే నిర్వహించారు. ఈ సర్వేకు 133 మంది డైట్ స్టూడెంట్స్‌ను వినియోగించుకున్నారు. వీరి ఆయా స్కూళ్లలో పరిస్థితులపై ఆరా తీశారు. రిపోర్టు ఆధారంగా స్కూళ్లకు బడ్జెట్ కేటాయించాలని సర్కార్ భావిస్తోంది. ఈ నెల 15న ప్రారంభమైన సర్వే సోమవారం ముగిసినట్లు అధికారులు తెలిపారు.
యూడైస్ వివరాలు సీక్రెట్..
స్కూళ్లపై పరిస్థితులపై వివరాలను సేకరించి యూడైస్‌లో నమోదు చేయగా.. దీనికి సంబంధించిన వివరాలను సీక్రెట్‌గా ఉంచుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి యూడైస్ ప్లస్ లో వివరాలు సమగ్రంగా నమోదు చేశారు. స్టూడెంట్స్, టీచర్ల ఖాళీల వివరాలు, డ్రాపౌట్స్, మధ్యాహ్న భోజనం, మౌలిక వసతులు, ఆధార్ అనుసంధానం, స్కూల్ యూనిఫామ్స్, టెక్ట్స్ బుక్స్ సరఫరా తదితర వివరాలను సేకరించారు. స్కూళ్లలో వసతులు, టీచర్లు, స్టూడెంట్స్‌ను మాడ్యూల్స్‌గా విభజించి నమోదు చేసినట్లు సమాచారం. గ్రౌండ్ కోసం స్థలం ఉందా..? క్లాస్ రూమ్‌లు ఎన్ని ఉన్నాయి..? ఇంకా ఏమేం అవసరం..? ఫర్నిచర్, ల్యాబ్, ఇతర సదుపాయాలు ఉన్నాయా ..? అమలవుతున్న కార్యక్రమాలు ఇందులో ఉంటాయి.
వారం రోజులుగా సర్వే..
స్కూల్ విద్యా వ్యవస్థ ప్రామాణికత ను తెలిపే యూడైస్ ప్లస్ రిపోర్టు ను స్కూల్ హెడ్మాస్టర్ నమోదు చేస్తారు. ఈ రిపోర్ట్ పై సర్వే చేపట్టేందుకు డైట్ స్టూడెంట్స్ కు ఉన్నతాధికారులు రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. స్కూల్ రిపోర్టు కార్డు ఆధారంగా పరిశీలించి, స్కూల్స్ లో ఉన్న వాస్తవ పరిస్థితులు వివరాలన్నీ యూడైస్ లో హెడ్ మాస్టర్స్ నమోదు చేశారా..? స్టూడెంట్స్ సంఖ్య, సౌకర్యాలు ఏ మేరకు ఉన్నాయ్ అనేది రిపోర్టు లో నమోదు చేసిన వివరాల ద్వారా ఫిజికల్ పరిశీలన చేసి కన్మఫ్ చేయనున్నారు. తప్పులు ఉంటే సరి చేయాలని హెడ్మాస్టర్లకు సూచించారు. సర్వే ఆధారంగా సౌకర్యాలతో పాటు యూపీఎస్ ల్లో సబ్జెక్ట్ వైస్ గా కొరత ఉన్న టీచర్లను కేటాయింపు జరుగుతుందని స్టూడెంట్స్
ఆశిస్తున్నారు.
జిల్లాల వారీగా సర్వే
యూడైస్ ప్లస్ సర్వే కోసం ఉమ్మడి జిల్లాలో 1,289 స్కూళ్లను ఎంపిక చేశారు. ఈ స్కూళ్లలో సర్వే చేసేందుకు జిల్లాల వారీగా డైట్ స్టూడెంట్స్‌ను సెలెక్ట్ చేశారు. జగిత్యాల జిల్లా లో 410 స్కూళ్లకు 41 మంది డైట్ స్టూడెంట్స్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 270 స్కూళ్లకు 27 మంది, పెద్దపల్లి జిల్లాలో 279 స్కూళ్లకు 30 మంది, కరీంనగర్ జిల్లాలో 330 స్కూళ్లకు 35 మంది డైట్ స్టూడెంట్స్ ను సర్వే కోసం కేటాయించారు. వీరంతా వారం రోజులు సర్వే చేసి వివరాలు నమోదు చేశారు.
సర్వే నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం
ఉమ్మడి జిల్లాలో స్కూళ్లలో వసతులు, టీచర్ల సంఖ్య తదితర వివరాలతో ప్రభుత్వం తొలిసారి సర్వే చేయించింది. ఈ నెల 15న ప్రారంభమైన సర్వే 21న పూర్తయింది. ఫీల్డ్‌లో సేకరించిన వివరాలను డైట్ స్టూడెంట్స్ ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలకు అందజేశారు. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం.
రాము, డీఈవో జగిత్యాల