
- ఈ కార్డు ఉన్నోళ్లకే కేంద్ర ప్రభుత్వ పథకాలు
- 21 రకాల వైకల్యాలకు గుర్తింపు
మంచిర్యాల, వెలుగు : దివ్యాంగుల గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డులను జారీ చేస్తోంది. ఈ కార్డులు ఉన్న వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే సదరం సర్టిఫికెట్ తీసుకున్న వారికి యూడీఐడీ కార్డులను ఆటోమేటిక్‌గా జనరేట్ చేసి వారి ఇంటికి పంపిస్తున్నారు. కానీ కొత్తగా సర్టిఫికెట్ కావాల్సిన వారు, సదరం సర్టిఫికెట్ గడువు ముగిసి రెన్యూవల్ చేసుకోవాల్సిన మారు మాత్రం కార్డు కోసం అప్లై చేసుకోవాలి.
ఆన్లైన్లో అప్లికేషన్యూడీఐడీ కార్డు కోసం దివ్యాంగులు
www.swavalambancard.gov.in వెబ్సైట్లో నేరుగా గానీ, మీ – సేవ ద్వారా గానీ అప్లై చేసుకోవాలి. తర్వాత గతంలో మాదిరిగానే జిల్లా హాస్పిటల్లో నిర్వహించే మెడికల్ క్యాంప్‌నకు హాజరు కావాలి. అక్కడ వారికి స్లాట్ కేటాయించి మెడికల్ క్యాంప్ ఎప్పుడు ఉంటుందనేది ఫోన్ ద్వారా తెలియజేస్తారు. వారు చెప్పిన రోజున క్యాంప్‌నకు హాజరైతే సంబంధిత డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించి వైకల్యం శాతాన్ని నిర్ధారిస్తారు.
ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. దాని ప్రకారం యూడీయూడీ కార్డును పోస్టులో ఇంటికే పంపుతారు. ఈ విధానం వల్ల సదరం సర్టిఫికెట్ల మాదిరిగా రోజుల తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. యూడీఐడీ ద్వారా వైకల్య నిర్ధారణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 38 హాస్పిటల్స్‌ను గుర్తించారు. రానున్న రోజుల్లో మరిన్ని హాస్పిటల్స్‌ను గుర్తించే అవకాశం ఉందని ఆఫీసర్లు తెలిపారు.
అప్లికేషన్ ప్రక్రియ ఇలా...
వెబ్సైట్లో వివరాలు నమోదు చేయగానే ఒక ఎన్రోల్మెంట్ నంబర్ కేటాయిస్తారు. అప్లికేషన్ స్టేటస్‌ను ఈ ఎన్రోల్మెంట్ నంబర్, పుట్టిన తేదీ ద్వారా తెలుసుకోవచ్చు.
2023 అక్టోబర్ 31 వరకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్ల వివరాలతో ఇప్పటికే కొందరికి యూడీఐడీ కార్డులను జనరేట్ చేసి పోస్టులో పంపించారు. ఇంకా కార్డు రాని వారు తమ కార్డు జనరేట్ అయ్యిందా ? లేదా అనేది యూడీఐడీ పోర్టల్‌లో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ద్వారా ద్వారా తెలుసుకోవచ్చు.
ఒకవేళ కార్డు పోయినట్టయితే యూడీఐడీ పోర్టల్‌లో పీడబ్ల్యూడీ లాగిన్లోకి వెళ్లి ‘కార్డ్ లాస్ట్’ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత అందులో వివరాలు నమోదు చేస్తే కొత్త కార్డు ఇంటికి వస్తుంది.
2023 నవంబర్ 1కి ముందు సదరం సర్టిఫికెట్ ఉండి యూడీఐడీ కార్డు రానివారు సంబంధిత డీఆర్డీవోను సంప్రదించాలి. గతంలో సదరంలో తిరస్కరించిన వారు కూడా యూడీఐడీలో కొత్తగా అప్లై చేసుకోవచ్చు.
21 రకాల వైకల్యాలకు..
వికలాంగుల హక్కుల చట్టం (ది రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్) 2016 ప్రకారం కేంద్ర ప్రభుత్వం 21 రకాల వైక్యాలను గుర్తించింది. ఇప్పటివరకు సదరంలో బ్లైండ్నెస్లో విజన్,లెప్రసీ క్యూర్డ్, హియరింగ్ ఇంపేయిర్మెంట్, లోకోమోటర్ డిజేబిలిటీ, మెంటల్ రిటార్డేషన్, మెంటల్ ఇల్నెస్కు మాత్రమే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. యూడీఐడీలో ఈ ఏడింటితో పాటు మరో 14 రకాలను సైతం చేర్చారు.
ఆటిజమ్ స్పెక్ర్టమ్, సెరబ్రల్ పాల్సీ, క్రానిక్ న్యూరోలాజికల్ కండీషన్స్, డ్వార్ఫిజమ్ (మరుగుజ్జు), హీమోఫీలియా, మల్టీపుల్ స్ల్కైరోసిస్, మస్క్యులర్ డిస్ర్టోఫీ, పార్కిన్సన్, సికిల్‌సెల్, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజేబిలిటీ, థలసేమియా, ఆసిడ్ అటాక్ విక్టిమ్స్, మల్టీపుల్ డిజేబిలిటీస్ను సైతం యూడీఐడీలో చేర్చారు
ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యూడీఐడీ కార్డుల కోసం దివ్యాంగులు మీ–సేవలో అప్లై చేసుకోవాలి. ఇప్పటికే సదరం సర్టిఫికెట్ పొందిన వారికి యూడీఐడీ కార్డు డైరెక్ట్‌గా పోస్ట్‌లో ఇంటికే వస్తుంది. కొత్తగా సర్టిఫికెట్ కావాల్సిన వారు, గతంలో సదరంలో రిజెక్ట్ అయిన వారితో పాటు సదరం సర్టిఫికెట్ గడువు ముగిసి రెన్యూవల్ కోసం ఎదురుచూస్తున్న వారు మాత్రమే యూడీఐడీ కోసం అప్లై చేసుకోవాలి. ఏవైనా సమస్యలుంటే కలెక్టరేట్లోని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసులో సంప్రదించాలి. - కిషన్, రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్, మంచిర్యాల