
- 238 మంది డైట్ స్టూడెంట్లతో సర్వే
- ఉమ్మడి జిల్లాలో 2,383 పాఠశాలలు ఎంపిక
- నేటితో సర్వే పూర్తి
- యుడైస్ ప్లస్ ఆధారంగానే పాఠశాలల అభివృద్ధికి నిధులు
ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లలో యు డైస్ ప్లస్ (యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్) పై సర్వే జరుగుతోంది. ఈనెల 15న ప్రారంభమైన సర్వే 21 వరకు సాగనుంది. పాఠశాలలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని యు డైస్ ప్లస్‌లో ప్రధానోపాధ్యాయులు నమోదు చేసే సమాచారంపై మొదటి సారి సర్వే చేపట్టారు. ఇందుకు మొత్తం 238 మంది డైట్ ఛత్రోపాధ్యాయులను నియమించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,383 పాఠశాలల పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. యుడైస్ ప్లస్ వెబ్ పోర్టల్ నమోదు చేసిన రిపోర్ట్ ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించనున్న నేపథ్యంలో ఈ సర్వే కీలకంగా మారనుంది.
ఛత్రోపాధ్యాయులతో సర్వే..
యు డైస్ ప్లస్‌పై సర్వే కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 238 మంది ఛత్రోపాధ్యాయులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి సర్వే చేయిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో సర్వే చేపట్టారు. ఒక్కో ఛత్రోపాధ్యాయుడికి 10 పాఠశాలలను కేటాయించారు. రోజుకు రెండు స్కూళ్లను సందర్శించి యుడైస్పై వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఐదు రోజుల్లో ఈ సర్వే పూర్తి చేయాలి. ఈ సర్వేలో వారి పరిశీలనలో వచ్చిన తప్పులను సరి చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ సర్వే చేస్తున్న ఉపాధ్యాయులు గుర్తించిన తప్పులను యుడైస్ లాగిన్‌లో వెంటనే సవరించకుంటే సంబంధిత హెచ్‌ఎంలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. యుడైస్ ఆధారంగానే స్కూళ్లకు ర్యాంకులు కేటాయిస్తారు. ఈ ర్యాంకుల ఆధారంగా స్కూళ్లలో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. ఈ నేపథ్యంలో సదరు స్కూళ్లకు కావాల్సిన నిధులు సైతం కేటాయించే అవకాశం ఉంటుంది.
యుడైస్లో ఉన్నవి వాస్తవాలేనా..?
గతేడాది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో సర్వే చేసి బడుల్లో ఏం ఉన్నవి.. ఏం లేవు అనే వివరాలను హెడ్మాస్టర్లు యుడైస్ పోర్టల్‌లో నమోదు చేశారు. విద్యార్థులు, టీచర్ల సంఖ్య, బడుల్లో సదుపాయాలు, ఆట స్థలాలు, తరగతి గదులు, ఫర్నీచర్, తాగునీరు, మరుగుదొడ్లు, భవనాలు, ప్రహరీ, ఖాళీల వివరాలు, కంప్యూటర్లు, కిచెన్ గార్డులు, మధ్యాహ్న భోజన పథకం, యూనిఫామ్ పంపిణీ, పాఠ్యపుస్తకాల సరఫర వంటి వివరాలు యుడైస్లో నమోదు చేశారు. అయితే నిధులు వస్తాయేమోననే ఉద్దేశంతో ఉన్న వసతులను లేవని చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వాస్తవాలను తెలుసుకునేందుకు నమోదు చేసి సమాచారాన్ని ధ్రువీకరించేందుకు ఛత్రోపాధ్యాయులతో సర్వే నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ చరిత్రలోనే మొదటిసారి థర్డ్ పార్టీతో ఈ సర్వే చేయిస్తున్నారు. ఈనెల 21 వరకు పూర్తి చేసిన సర్వే వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు.
పకడ్బందీగా సర్వే చేస్తున్నాం
జిల్లాలో యుడైస్ పై సర్వే పకడ్బందీగా జరుగుతోంది. పాఠశాలల్లో చేపట్టిన సర్వేను ఎప్పకప్పుడు పరిశీలిస్తున్నాం. వాస్తవ పరిస్థితులను హెచ్ఎంలు తెలియజేయాలి. యుడైస్లో ఏమైనా తప్పులుంటే వెంటనే లాగిన్లోకి వెళ్లి సరిచేసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించి తప్పులు సరిచేసుకోకుంటే చర్యలు తీసుకుంటాం. – నారాయణ, సెక్టోరియల్ అధికారి