యూఎఫ్ వో? సూపర్​ మ్యాన్? ఏరో ప్లేన్? ఆకాశంలో ఆ వింత వస్తువు ఏమిటి?

యూఎఫ్ వో? సూపర్​ మ్యాన్? ఏరో ప్లేన్? ఆకాశంలో ఆ వింత వస్తువు ఏమిటి?

లండన్: ఆకాశం నుంచి అగ్నిగోళం దూసుకొచ్చిందా అనిపించే సీన్.. దాదాపు 20 నిమిషాల పాటు నింగిలో చక్కర్లు కొట్టిన వింత వస్తువు.. అసలేంటిది.. ఆకాశంలో ఎగిరే వస్తువా(యూఎఫ్​వో)? లేదంటే ఏరో ప్లేనా? లేకపోతే సూపర్​మ్యానా? ఇలాంటి ప్రశ్నలే ఇంగ్లండ్​లో చాలా మందికి వచ్చాయి. కానీ వీటికి జవాబు మాత్రం దొరకలేదు. 20 నిమిషాల పాటు కనిపించిన ఆ వింత వస్తువు ఆ తర్వాత కనుమరుగైపోయింది. ఇంగ్లండ్​లోని కేంబ్రిడ్జ్​షేర్​లో కనిపించిన ఈ వస్తువును ఓ వ్యక్తి దీనిని వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఉల్కాపాతం, బాణాసంచా, విమానం ట్రయల్స్​ అంటూ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నా అసలు అదేమిటనేది ఇప్పటికీ మిస్టరీగా మారింది.

20 నిమిషాల సేపు ఆకాశంలోనే..
కేంబ్రిడ్జ్​ షేర్​కు చెందిన 55 ఏండ్ల గ్యారీ అండర్​వుడ్ కు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. బుధవారం సాయంత్రం తన ఇంటి దగ్గర ఆకాశంలో వింత వస్తువు కనిపించడంతో వెంటనే కెమెరా తీసుకుని దానిని షూట్​ చేయడం మొదలుపెట్టాడు. దాదాపు 10 నుంచి 20 నిమిషాల సేపు మండే అగ్నిగోళలాంటి వస్తువు ఆకాశంలో కనిపించిందని, చూసేందుకు చిన్నగా, మబ్బులా ఉందని అతడు చెప్పాడు. అది చాలా వేగంగా కదిలిందని, అది ఉల్కాపాతం కాదని, ఉల్కాపాతం అయితే క్షణాల్లో కనుమరుగయ్యేదని అన్నాడు. తాను ఆకాశంలో స్టార్స్​ను షూట్​ చేస్తూ ఉంటానని, కానీ ఇది వాటన్నింటికీ భిన్నమైనదన్నాడు. కిందికి వచ్చే సమయంలో అది రౌండ్లు తిరుగుతూ చాలా స్లో అయ్యిందని, దాని కలర్​ కూడా ఆరెంజ్​ కలర్​లోకి మారిపోయిందని, దాని వెనకవైపు నుంచి మంటలు, పొగ వచ్చినట్టుగా కనిపించిందని వివరించాడు. ఆ తర్వాత చెట్ల వెనకకు వెళ్లడంతో అది కనపించలేదన్నాడు. ఫొటోల్లో చాలా పెద్ద వస్తువులా కనిపిస్తున్నా.. అసలు అదేంటనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే నేషనల్​ స్పేస్​ అకాడమీ దీనికి సంబంధించి ఒక థియరీ చెపుతోంది. అది హై అల్టిట్యూడ్​ జెట్​ నుంచి వచ్చిన వెలువడిన వాటర్ కావచ్చని అంటోంది. సూర్యుడి కిరణాలు పడటంతో అది మంటల్లా కనిపించిందని చెబుతోంది.