
ఇవాళ ఉగాది, రేపు రంజాన్... ఈ రెండు పర్వదినాల వేళ పసందైన విందు తయారీకీ, అలాగే తినడానికీ.. ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటారు. అయితే ఈ రెండు పండుగల సందర్భంగా కాస్త వెరైటీగా, సింపుల్‌గా, టేస్టీగా.. ఇంకా చెప్పాలంటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలా ఉండే రెసిపీలు ఇవి. మరింకెందుకాలస్యం.. ఈ వారం స్పెషల్స్పై ఓ లుక్కేయండి.
ఉగాది వెరైటీలు
రవ్వ బొబ్బట్లు
కావాల్సినవి : గోధుమ పిండి, బొంబాయి రవ్వ, చక్కెర – ఒక్కో కప్పు
ఉప్పు – కొంచెం, నూనె – రెండు టేబుల్ స్పూన్లు
నీళ్లు, నెయ్యి – సరిపడా
యాలకుల పొడి – ఒక టీస్పూన్
తయారీ : ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, నూనె వేసి కలపాలి. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ ముద్దగా కలపాలి. పిండి ఎంత సాఫ్ట్‌గా ఉంటే బొబ్బట్లు కూడా అంతే మెత్తగా వస్తాయి. మూతపెట్టి కాసేపు పక్కన ఉంచాలి. పాన్‌లో బొంబాయి రవ్వ వేసి వేగించాలి. ప్లేట్లోకి తీసుకుని చల్లార్చాలి. అదే పాన్‌లో రెండున్నర కప్పుల నీళ్లు పోసి కాగబెట్టాలి. అవి మరిగాక అందులో రవ్వను వేస్తూ ఉండలు లేకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి.
మూతపెట్టి ఉడికించాలి. అందులో చక్కెర వేసి బాగా కలపాలి. మరికాసేపు ఉడికాక, నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. మూతపెట్టి కాసేపు పక్కన పెట్టాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఒకసారి గరిటెతో బాగా కలపాలి. ఉండలు చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత రెడీ చేసిపెట్టుకున్న పిండి ముద్దను మరోసారి కలిపి ఉండలు చేయాలి. ఒక్కో ఉండను అరచేతిలో వెడల్పుగా చేసి, దాని మధ్యలో రెడీగా ఉన్న లడ్డు స్టఫింగ్ పెట్టి మూసేయాలి. తర్వాత చపాతీల్లా వత్తి పెనం మీద రెండు వైపులా నెయ్యితో కాల్చాలి. ఈ రవ్వ బొబ్బట్లు తినే కొద్దీ తినాలనిపిస్తాయి.
ఫ్రూట్ శ్రీకంఢ్
కావాల్సినవి : తాజా గడ్డ పెరుగు – రెండు కప్పులు
మామిడి గుజ్జు – అర కప్పు
ఆపిల్, అరటి – ఒక్కోటి
చక్కెర పొడి – నాలుగు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి – పావు టీస్పూన్
జాజికాయ పొడి – చిటికెడు
బాదం, పిస్తా తరుగు – సరిపడా
తయారీ : ముందుగా ఆపిల్, అరటి పండ్లను చిన్న ముక్కలుగా తరగాలి. ఒక గిన్నెలో పెరుగు, చక్కెర పొడి వేసి బాగా కలపాలి. తర్వాత అందులో మామిడి పండు గుజ్జు, అరటి పండు ముక్కలు వేసి మరోసారి కలపాలి. ఆపై మిగిలిన అరటి పండు ముక్కలతోపాటు ఆపిల్ తరుగు కూడా వేయాలి. యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి కలపాలి. చివరిగా బాదం, పిస్తా తరుగు చల్లుకుని తింటే ఈ సీజన్‌కి బెస్ట్ డెజర్ట్ ఇదే అని అనకమానరు.
ఈద్ స్పెషల్స్
చికెన్ షవర్మా
కావాల్సినవి : చికెన్ (బ్రెస్ట్ పీస్) – అర కిలో
ధనియాల పొడి, కారం – ఒక్కో టీస్పూన్
దాల్చినచెక్క పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీస్పూన్ చొప్పున
పెరుగు – రెండు టీస్పూన్లు
ఉప్పు, నూనె – సరిపడా
రోల్ కోసం :
మైదా – రెండు కప్పులు
ఈస్ట్ – ఒక టీస్పూన్
పాలు – పావు కప్పు
చక్కెర – అర టీస్పూన్
నూనె – ఒక టేబుల్ స్పూన్
తయారీ : ఒక గిన్నెలో మైదా, ఈస్ట్, పాలు, ఉప్పు, చక్కెర, నూనె వేసి పాలు పోసి కలపాలి. ముద్దగా అయ్యాక మూతపెట్టి కాసేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత మరోసారి పిండి ముద్దను బాగా కలిపి, చిన్న ఉండలు చేయాలి. వాటిని చపాతీల్లా వత్తి, పెనం మీద కాల్చాలి. చికెన్ శుభ్రంగా కడిగాక బ్రెస్ట్ పీస్ పెద్దగా, మందంగా ఉంటుంది కాబట్టి సన్నని లేయర్స్‌లా నిలువుగా కట్ చేయాలి. తర్వాత అలా కట్ చేసిన చికెన్‌పై కారం, ఉప్పు, పసుపు, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలపాలి.
మూతపెట్టి అరగంట సేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత గ్రిల్ పాన్‌లో నూనె వేడి చేసి చికెన్ పీస్‌లను పెట్టి వేగించాలి. రెండువైపులా బాగా వేగాక కాస్త వేడిగా ఉండగానే షవర్మాలో స్టఫింగ్‌లా పెట్టుకోవడానికి వీలుగా ఉండేలా తరగాలి. ఆ తర్వాత రెడీ చేసిపెట్టుకున్న చపాతీ లేదా నాన్ (ఫ్లాట్‌బ్రెడ్) తీసుకుని దానిపై టొమాటోసాస్, మయోనీస్ పూయాలి. ఆపై చికెన్, ఉల్లిగడ్డ, ఇతర వెజిటబుల్స్ తరుగు పెట్టి, కెచప్, మయోనీస్ వేయాలి. దాన్ని రోల్లా చుట్టి కట్ చేసి తినడమే.
షికమ్‌పురి కబాబ్
కావాల్సినవి : మటన్ – పావు కిలో
కారం, కశ్మీరీ చిల్లీ
పసుపు – అర టీస్పూన్
యాలకులు – రెండు,
దాల్చినచెక్క – ఒకటి
లవంగాలు – నాలుగు,
పచ్చిమిర్చి – మూడు
కొత్తిమీర, పుదీనా – కొంచెం
ఉల్లిగడ్డ – ఒకటి; నూనె, పెరుగు, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్ల చొప్పున
శనగపప్పు – ముప్పావు కప్పు, నీళ్లు – ఒక కప్పు.
పౌడర్ – ఒక టీస్పూన్, ఉప్పు – సరిపడా
తయారీ : ప్రెజర్ కుక్కర్లో మటన్ ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, నానబెట్టిన శనగపప్పు కూడా వేసి బాగా కలపాలి. తర్వాత కశ్మీరీ కారం కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని వేసి నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. నీళ్లు దాదాపు ఇంకిపోయి ఇంగ్రెడియెంట్స్ అన్నీ మెత్తగా ఉడికాక, కాస్త చల్లారనివ్వాలి. ఆపై మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
స్టఫింగ్ కోసం పెరుగు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. ఆ తర్వాత మటన్ మిశ్రమాన్ని అరచేతిలో గారెలా చేసి అందులో స్టఫింగ్ పెట్టి మూసేయాలి. కబాబ్ ఆకారంలో చేసి, నెయ్యితో రెండు వైపులా కాల్చాలి.