ఈసారి వర్షాలు ఫుల్.. రైతులు ఖుష్.. రియల్ ఎస్టేట్ ఉరుకులు.. సంతోష్ శాస్త్రి పంచాంగ పఠనం

ఈసారి వర్షాలు ఫుల్.. రైతులు ఖుష్.. రియల్ ఎస్టేట్ ఉరుకులు.. సంతోష్ శాస్త్రి పంచాంగ పఠనం
  • రియల్ ఎస్టేట్ ఉరుకులు.. అదుపులో శాంతిభద్రతలు
  • సీఎం ప్రజారంజక పాలన అందిస్తారు 
  • తెలుగు రాష్ట్రాల్లో పోటాపోటీగా ముఖ్యమంత్రుల పరిపాలన
  • పొరుగు రాష్ట్రాలతో నీళ్ల పేచీ.. సమన్వయంతో సీఎం పరిష్కరిస్తరు 
  • రేవంత్ రెడ్డికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయ్
  • హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సంతోష్ శాస్త్రి పంచాంగ పఠనం 
  • ఆదివారం చుక్క, ముక్క ముట్టకపోతే రాష్ట్రానికి అంతా మంచే జరుగుతుందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈసారి వర్షాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, పంటలు బాగా పండుతాయని ప్రముఖ పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్  శాస్త్రి వెల్లడించారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు నిరంతరం జాగ్రత్తగా ఉంటూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా పని చేస్తారని అన్నారు. రియల్ ఎస్టేట్  రంగం పరుగులు పెడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆదివారం ఉగాది వేడుకలు జరిగాయి. జ్యోతి వెలిగించి సీఎం రేవంత్  రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీఎస్  శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతోష్  కుమార్  శాస్త్రి పంచాంగం చదివి వినిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలకులు పోటీపడి పనిచేస్తారని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో నీళ్లు, ఇతర విషయాల్లో  పేచీ తప్పదని, అయితే.. సమన్వయం, చాకచక్యంతో సీఎం రేవంత్  రెడ్డి వాటిని పరిష్కరిస్తారని చెప్పారు. విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తారని తెలిపారు.

‘‘విద్య, వైద్యంపై ఈ ఏడాది ప్రభుత్వం మరింత దృష్టి పెడుతుంది. ఈసారి కూడా కేంద్రం నుంచి రాష్టానికి రావాల్సిన వాటాలను సీఎం తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ప్రజాహితం కోసం నిధులు ఖర్చు చేస్తారు. విదేశాల నుంచి  పెట్టుబడులు, కంపెనీలు రావడానికి ఆస్కారం ఉంది. కాగా.. ఈసారి రవి రాజు అయినందున ఆదివారం రోజు చుక్క , ముక్క ముట్టుకోకపోతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పాలకులు, ప్రజలు ఆదివారం చుక్క, ముక్క తీసుకోకపోతే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒంటి చేత్తో వాటన్నిటినీ సీఎం ఎదుర్కొంటారు. ప్రజలు మెచ్చే విధంగా ప్రజారంజక పాలన అందిస్తారు” అని సంతోష్  కుమార్  పేర్కొన్నారు.

కాగా.. ప్రధాని నరేంద్ర మోదీది వృశ్చిక రాశి అని, ఈ ఏడాది ఆయనకు కొంత ఇబ్బంది ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిది తులరాశి అని, ఈ రాశి వారికి ఈసారి తిరుగులేదన్నారు. రేవంత్ రెడ్డికి ఈ ఏడాది పేరు ప్రఖ్యాతులు వస్తాయని, అయితే.. విపరీతమైన నరఘోష కదిలించి వేస్తుందని పేర్కొన్నారు. అనంతరం అర్చకులు భద్రాచలం రాములవారి కల్యాణానికి రావాలని ఆహ్వానిస్తూ కల్యాణ పత్రికను ముఖ్యమంత్రికి అందించారు.