
ఉగాది పండుగ అంటే నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం. ఈ రోజున కేవలం షడ్రుచుల పచ్చడి మాత్రమే కాకుండా.. మరిన్ని రుచికరమైన వంటకాలను కూడా ట్రై చేయవచ్చు. ఇందుకోసం కొన్ని సాంప్రదాయ వంటకాలను సిద్ధం చేసుకోండి. మరీ ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు.. భక్ష్యాల తయారీ ఏమేం కావాలి.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. . .
కొబ్బరి బూరెలు తయారీకి కావాల్సినవి
- మినప్పప్పు: ఒక కప్పు
- బియ్యప్పిండి: రెండు కప్పులు
- ఉప్పు: చిటికెడు
- నూనె: వేగించడానికి సరిపడా
- బెల్లం తురుము: ఒక కప్పు
- కాజు: పావు కప్పు
- పచ్చి కొబ్బరి తురుము: మూడు కప్పులు
- నీళ్లు: తగినన్ని
- యాలకుల పొడి: అర టీ స్పూన్
తయారీ విధానం:పొడి మినప్పప్పును మెత్తగా పిండి పట్టుకోవాలి. తర్వాత జల్లించుకుని ఒక బౌల్లో పోసుకోవాలి. ఇందులోనే రెండు కప్పుల పొడి బియ్యప్పిండి, చిటికెడు ఉప్పు వేయాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మెత్తగా కలిపి రెండు గంటల పాటు పక్కనపెట్టాలి. స్టవ్ పై ఒక మూకుడు పెట్టి అందులో బెల్లం, మూడు కప్పుల కొబ్బరి తురుము కూడా వేసి రెండింటినీ బాగా కలపాలి. పాకం దగ్గరపడ్డాక కాజు వేసి బాగా కలిపి స్టవ్ ఆపాలి. తర్వాత రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి వేసి మరోమారు కలపాలి. తర్వాత యాలకుల పొడి వేసి కలిపి, చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి. నానబెట్టిన పిండిలో కొన్ని నీళ్లుపోసి జారుగా చేసుకోవాలి. కొబ్బరి - బెల్లం ఉండలను ఈ పిండిలో ముంచి, నూనెలో వేగించాలి. ఎర్రగా వేగాక తీస్తే కొబ్బరి బూరెలు రెడీ
►ALSO READ | తెలుగువారి కొత్త సంవత్సరం: ఉగాది పచ్చడి తయారీ విధానం.. ఇది కచ్చితంగా తినాల్సిందే..
భక్ష్యాలు తయారీకి కావాల్సినవి
- శెనగపప్పు: ఒక కప్పు
- బెల్లం తురుము: ఒక కప్పు
- మైదా పిండి: ఒకటిన్నర కప్పు
- నూనె: రెండు టేబుల్ స్పూన్లు
- నెయ్యి: ఒక టేబుల్ స్పూన్
- యాలకుల పొడి: రెండు టీ స్పూన్లు
తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, చిటికెడు ఉప్పు వేసి చపాతీ పిండిలాగా కలిపి అరగంట పక్కనపెట్టాలి. శెనగపిండిని అరగంటపాటు నానబెట్టి, కాస్త పలుకుగా ఉడికించుకోవాలి. చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. అందులో బెల్లం తురుము, యాలకుల పొడి కూడా వేసి మరోసారి గ్రైండ్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ఒక పళ్లెంలోకి తీసుకుని, చేతికి నెయ్యి రాసుకుని ఉండలుగా చేసి ఉంచుకోవాలి. మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీల్లాగా ఒత్తుకోవాలి. పూరీ మధ్యలో శెనగపప్పు-బెల్లం ఉండలు ఉంచి, అంచులని పూర్తిగా కవర్ చెయ్యాలి. తర్వాత నెమ్మదిగా చేత్తో తడుతూ, పూరీలాగా వత్తాలి. తర్వాత పెనం వేడి చేసి, నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే.. వేడి వేడి భక్ష్యాలు రెడీ
–వెలుగు,లైఫ్–