
కాలాన్ని ఎవరూ ఆపలేరు... దానికి ఎదురెళ్లడం ఎవరికీ సాధ్యపడే విషయం కాదు. పురాణాల ప్రకారం తెలుగు సంవత్సరాలు 60.. తెలుగు మాసాలు 12.. మాసము అంటే నెల అని అర్దం.. తెలుగు నెలల్లో మొదటిది.. చైత్రమాసం.. చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున కృత యుగం ప్రారంభమైందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఆ రోజున( 2025, మార్చి 30) ఉగాది పండుగ జరుపుకుంటాం. ఇప్పుడు ఉగాది పండుగ ఎలా ప్రారంభమైంది.. దాని విశిష్టత ఏమిటి.. మొదలగు విషయాలను ఒకసారి తెలుసుకుందాం. . .
ఉగాది అంటే యుగానికి ఆరంభం. యుగం+ఆది= యుగాది.. ఇది కాస్త కాల క్రమేణ ఉగాదిగా మారింది. ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. అంటే ఆసంవత్సరం పేరుతో ఉగాది పండుగగా మారింది. ఈ ఏడాది అంటే క్రోధినామ సంవత్సరం మార్చి 29న ముగుస్తుంది. ఆ తరువాత మార్చి 30 నుంచి శ్రీ విశ్వావశు నామ సంవత్సరం ప్రారంభకానుంది.
ఉగాది పండుగ రోజు అన్ని ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం ఉంటుంది. దీని ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి.. పంటలు ఎలా పండుతాయి.. ఏ రాశి వారికి ఎంత మేరకు అనుకూలంగా ఉంటుంది. దేశంలో జరిగే విశేషాలు.. వర్షాలు ఎలా పండుతాయి.. ఇలా భవిష్యత్తును అంచనా వేస్తూ పంచాంగం లో ఉన్న విషయాలను భక్తులకు అర్దమయ్యే రీతిలో వివరిస్తారు. వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు వంటి విషయాలు తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఉగాది పండుగ వెనక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెప్తారు. ఉగాది... 'ఉగ' అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అర్ధాలు ఉన్నాయి. వీటికి అది ఉగాది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్షుకు మొదటిరోజునే ఉగాదిగా మారిందంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం మొదలైందని, త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం. ఈ రోజే శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడని పురాణాల్లో ఉంది. బ్రహ్మదేవుడు సృష్టిని మొదలు పెట్టిన రోజే ఉగాదని అంటారు. మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్టించాడనేది కూడా ప్రచారంలో ఉంది.
మన సంప్రదాయంలో ఏ పండుగను చూసినా అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అందులోనూ ఉగాది అయితే... దాన్ని ఏ కోణంలో చూసినా ప్రకృతి ఆధారంగానే కనిపిస్తుంది. వసంత రుతువు వచ్చిందని తెలియజేసే పండుగ పచ్చడి ఒక ఔషధం. ఉగాది.. ఉగాది నాటికి చుట్టు పక్కన ఏ చెట్టును చూసినా లేత ఆకులతో పచ్చగా కనువిందు చేస్తుంటుంది. ఆ సంతోషం కోయిల పాటల్లో, నెమలి నాట్యాల్లో కనిపిస్తుంది. వసంతుడి ఆటల్ని చూసి మనసు పరవశించి పోకుండా ఉండగలదా!
హిందువుల పండుగలు సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి జరుపుకుంటాము. ఉన్నంతలో ప్రతి పండుగను సంప్రదాయంగా జరుపుకోవాలి. దీని ద్వారా పిల్లలకు పండుగలు.. వాటి ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది. అప్పుడు భవిష్యత్ తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను భద్రంగా అందించిన వాళ్లమౌతాము