శ్రీశైల మహాక్షేత్రంలో (Srisailam) శనివారం ( ఏప్రిల్ 6) నుంచి ఉగాది ఉత్సవాలు (Ugadi Festivals) జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఐదురోజులపాటు ఉగాది మహోత్సవాలను దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. ఉగాది మహోత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు మల్లన్న స్పర్శ దర్శనం (Mallanna Sparsha Darshanam)రద్దు చేశారు. ఉగాది ఉత్సవాల్లో అలంకార దర్శనం మాత్రమేనని దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈవో పెద్దిరాజు (EO Peddiraju) మాట్లాడుతూ ఉగాది మహోత్సవాలకు కర్ణాటక (Karnataka) రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర (Maharastra), తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తా రన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ముఖ్యంగా కాలిబాట మార్గంలో వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట, పెద్దచెరువు, మఠం బావి, భీముని కొలను, కైలాసద్వారం ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు లోటులేకుండా ఏర్పాట్లు చేశామని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఉత్సవాలలో స్వామి, అమ్మవార్ల కైంకర్యాలన్నీ సంపూర్ణంగా జరిపించేందుకు అవసరమైన ప్రణాళికలతో చర్యలు తీసుకున్నామని, క్యూలైన్లలో వేచివున్న భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందజేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
మరోవైపు ఉగాది ఉత్సవాలకోసం కర్నాటక నుంచి భక్తులు తరలివస్తుండడంతో శ్రీశైలంలో రద్దీ అనూహ్యంగా పెరిగింది. స్వామివార్ల దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. కర్ణాటకలోని శైవభక్తులు భ్రమరాంబికా దేవిని ఇంటి ఆడపడుచుగా కొలుస్తారు. ఉగాది ఉత్సవాల్లో ఆడపడుచును చూడాలని వేల మంది భక్తులు నల్లమల అడవుల నుంచి కాలినడకన శ్రీశైలానికి రావడం ఆనవాయితీ. వేల మంది భక్తులు పాదయాత్రగా శ్రీశైలానికి తరలివస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ పెరిగింది.