
- పాల్గొన్న నందిని సిధారెడ్డి
మెదక్, వెలుగు: ఉగాది పండుగ పురస్కరించుకొని మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో శుక్రవారం తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. తెరసం అధ్యక్షురాలు ముత్తిగారి కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ కవి, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి పాల్గొని జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని ఉద్యమాల్లో కవితోద్యమం ముందుంటుందన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో కవి పాత్ర ఎనలేనిదన్నారు. ఉగాదికి పంచాంగ శ్రావణం ఎంత ముఖ్యమో కవి సమ్మేళనం అంతే విశేషమన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు వారి స్వీయ కవితలు వినిపించారు. ఉగాది ఉషస్సులు విరబూయాలని, సమసమాజ స్థాపనకు నడుంబిగించాలని, అసమానతలు తొలిగిపోవాలని భిన్నత్వం లో ఏకత్వమై సాగాలని కవితలు వినిపించారు. చిన్నారులు చేసిన నృత్య కార్యక్రమాలు అలరించాయి.
అనంతరం కవులను శాలువా, మెమెంటోతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెరసం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకర్, ప్రధాన కార్యదర్శి వి.శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్, తెరసం జంట నగరాల అధ్యక్షుడు కందుకూరి శ్రీరాములు, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ్యనాయక్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్, కేంద్ర కార్యవర్గ సభ్యులు అనురాధ, కవులు అంజగౌడ్, ఎండీ ఇక్బాల్, బుర్ర సంతోష్, మల్లేశం, వెంకటేశం, సరళ, అంజలి పాల్గొన్నారు.