T20 World Cup 2024: తొలి విజయం.. విక్టరీ డ్యాన్స్‌తో అలరించిన ఉగాండా జట్టు

T20 World Cup 2024: తొలి విజయం.. విక్టరీ డ్యాన్స్‌తో అలరించిన ఉగాండా జట్టు

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌లో ఉగాండా జట్టు తొలి విజయాన్ని అందుకుంది. గురువారం(జూన్ 06) పాపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రియాన్ మసాబా సేన 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత న్యూ గినియాను 77 పరుగులకే కట్టడి చేసిన ఉగాండా.. అనంతరం ఆ లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. ఈ మ్యాచ్‌ అనంతరం ఉగాండా ఆటగాళ్లు విక్టరీ డ్యాన్స్‌తో అలరించారు. 

 విజయం పరుగు పూర్తికాగానే డగౌట్‌లో కూర్చొని ఉన్న ఉగాండా ఆటగాళ్లు, సిబ్బంది మైదానంలో దూసుకొచ్చారు. జట్టును విజయతీరాలకు చేర్చిన తమ బ్యాటర్లను మనసారా హత్తుకొని సరికొత్త డ్యాన్స్‌కు తెరలేపారు. ఆటగాళ్ళు, సహాయక సిబ్బంది అందరూ సర్కిల్‌లా నిలబడి క్లాప్స్ కొడుతూ విక్టరీ డ్యాన్స్‌ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ విజయం ఒక తీపి జ్ఞాపకం: బ్రియాన్ మసాబా

మ్యాచ్ అనంతరం ఉగాండా కెప్టెన్ బ్రియాన్ మసాబా మాట్లాడుతూ.. ఈ విజయం తమకు ఎంతో ప్రత్యేకమైనదని తెలిపాడు. ప్రపంచ కప్‌లో మొదటి విజయం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు. మూడు, నాలుగేళ్లుగా ఎంతో కష్టపడి ప్రపంచ కప్‌కు అర్హత సాధించడం ఒక ఎత్తైతే, ఈ గెలుపు రుచి ఒక మధుర జ్ణాపకమని వెల్లడించాడు.