గుడ్ న్యూస్: రెండున్నరేండ్లలోనే డిగ్రీ..ఏడాదిలోనే పీజీ పూర్తి

గుడ్ న్యూస్:  రెండున్నరేండ్లలోనే డిగ్రీ..ఏడాదిలోనే పీజీ పూర్తి


హైదరాబాద్, వెలుగు:  మూడేండ్ల అండర్​ గ్రాడ్యుయేషన్​ డిగ్రీ కోర్సు ఇక రెండున్నరేండ్లే చదవొచ్చు.. రెండేండ్ల పీజీ కోర్సును ఒక్క ఏడాదిలోనే పూర్తి చేయొచ్చు.. డిగ్రీ, పీజీకి  ఏటా రెండుసార్లు అడ్మిషన్లు చేపట్టుకోవచ్చు.. దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలుచేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) డ్రాఫ్ట్​ను సిద్ధం చేసింది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 

 ఇందుకు సంబంధించి యూజీసీ రెగ్యులేషన్స్– 2024 డ్రాఫ్ట్ ను గురువారం కమిషన్​ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.జగదీశ్ రిలీజ్ చేశారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే పంపించాలని సూచించారు. కొత్త విధానాన్ని 2025–26 విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు. మన దగ్గర ప్రస్తుతం డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఏటా ఒకేసారి అడ్మిషన్లు జరుగుతున్నాయి. అయితే, అమెరికాలో మాదిరిగా ఏటా జనవరి/ ఫిబ్రవరిలో, జులై/ ఆగస్టు నెలల్లో మన దేశంలోనూ అడ్మిషన్లు చేపట్టనున్నారు. 

ఏడీపీ విధానం ఎంపిక చేసుకుంటే..!

ప్రస్తుతం అండర్​ గ్రాడ్యుయేషన్​ డిగ్రీలో మూడేండ్లు, నాలుగేండ్ల కోర్సులున్నాయి. అయితే, దీన్ని రెండున్నర ఏండ్లలోనే పూర్తి చేసేకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే, దీనికి ముందుగా డిగ్రీ పట్టాకు కావాల్సిన క్రెడిట్స్ ను సాధించాల్సి ఉంటుంది. ఇందుకోసం డిగ్రీ ఫస్ట్, సెకండ్ సెమిస్టర్ లో యాక్సిలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఏడీపీ) విధానాన్ని ఎంచుకోవాలి. ప్రస్తుతం ఇన్​ టెక్​లో కేవలం పదిశాతం సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఎక్కువ మంది దీన్ని ఎంచుకుంటే మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇక.. రెండేండ్ల పీజీని ఒకే ఏడాదిలో పూర్తి చేసేలా సంస్కరణలను యూజీసీ చేపట్టింది. 

డిగ్రీ ఏదైనా.. పీజీలో నచ్చిన కోర్సు చేయొచ్చు 

యూజీ డిగ్రీ ఏ సబ్జెక్టులో పాసైనా.. పీజీలో ఏ కోర్సులోనైనా చేరే అవకాశాన్ని కల్పించేందుకు యూజీసీ సిద్ధమైంది.  దీనికి నేషనల్ లెవెల్ లేదా యూనివర్సిటీ లెవెల్ ఎంట్రెన్స్​లలో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. దీంతో బీఏ కోర్సు చేసిన వాళ్లూ.. సీపీగెట్ లో ర్యాంకు పొంది ఎంఎస్సీలో చేరొచ్చు. అయితే.. యూజీసీ తాజా డ్రాఫ్ట్​పై గెజిట్​ రిలీజ్​ కావాల్సి ఉంది.