యూజీసీ గైడ్​లైన్స్‎తో వర్సిటీలకు ముప్పు

యూజీసీ  గైడ్​లైన్స్‎తో వర్సిటీలకు ముప్పు
  • కేంద్రం తీరుతో అవి స్వయం ప్రతిపత్తి కోల్పోతాయ్
  • వీసీల నియామకాన్ని గవర్నర్లకు అప్పగించడం ఏంటి?
  • విద్యా కమిషన్ సదస్సులో వక్తల ఆందోళన
  • యూజీసీ తన పరిధి దాటుతున్నది: జస్టిస్ సుదర్శన్ రెడ్డి 
  • వర్సిటీలపై యూజీసీ జోక్యం తగ్గాలి: ప్రొఫెసర్ హరగోపాల్ 
  • యూజీసీ ద్వారా వర్సిటీలపై కేంద్రం దాడి: ఆకునూరి మురళి

హైదరాబాద్, వెలుగు: యూజీసీ గైడ్​లైన్స్ ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మార్గదర్శకాలు యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని, రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని అన్నారు. వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  గురువారం హైదరాబాద్‎లోని ఎస్సీఈఆర్టీ భవనంలో  ‘యూజీసీ నిబంధనలు–స్టేట్ వర్సిటీల్లో జోక్యం’ అనే అంశంపై తెలంగాణ విద్యా కమిషన్ సదస్సు నిర్వహించింది. 

కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. యూజీసీ తన అధికారాల పరిధిని దాటి సిఫార్సులు చేస్తున్నదని అన్నారు. వర్సిటీల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు మాత్రమే యూజీసీ ఏర్పడిందని చెప్పారు. కానీ, యూనివర్సిటీలను ఆదేశించేందుకు, వర్సిటీల్లో నిర్ణయాలు చేసేందుకు కాదని తెలిపారు. వైస్ చాన్స్ లర్లు వర్సిటీలో భాగం కాదని, అలాంటప్పుడు వర్సిటీల్లో సబార్డినేట్ల కోసం ఏర్పడిన యూజీసీ.. వీసీల నియామక ప్రక్రియపై ఏ విధంగా సిఫారసు చేస్తుందని ప్రశ్నించారు.  

వర్సిటీల అటానమస్‎కు గొడ్డలిపెట్టు: ప్రొఫెసర్​ కోదండరాం 

యూజీసీ గైడ్​ లైన్స్ వర్సిటీల స్వయం ప్రతిపత్తికి గొడ్డలిపెట్టు అని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. వర్సిటీల అటానమస్‎ను కాపాడాల్సిన యూజీసీనే.. వాటి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఒక  రాజకీయ పార్టీ అభిప్రాయాల మేరకే సెంట్రల్ వర్సిటీల్లో రిక్రూట్​మెంట్​జరుగుతుందనే అభిప్రాయం అంతటా వినిపిస్తున్నదని చెప్పారు. యూనివర్సిటీల్లో స్వేచ్ఛ ఉండాలని, యూజీసీ జోక్యం తగ్గించాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు.  గ్రాంట్స్ ఇవ్వడమే యూజీసీ పని అని, వర్సిటీల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నదని, ఎందుకు పాలసీలు మారుస్తున్నదని ప్రశ్నించారు.

గవర్నర్లు కేంద్ర రాజకీయాలకు అనుగుణంగా పని చేస్తారని, అలాంటప్పుడు వీసీల నియామకాన్ని గవర్నర్లకు అప్పగించడం ఏంటని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూనివర్సిటీల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు. యూనివర్సిటీల నుంచి వస్తున్న మేధావివర్గంతో సర్కారు ఇబ్బంది పడుతున్నదని, అందుకే ఆ వర్గం లేకుండా యూజీసీ ప్రయత్నిస్తున్నదని ప్రొఫెసర్ శాంతసిన్హా అన్నారు. యూజీసీ గైడ్​ లైన్స్ ప్రాథమిక హక్కులను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేలా ఉన్నాయని  ప్రొఫెసర్ నర్సింహారెడ్డి  తెలిపారు. ప్రొఫెసర్ రమా మేల్కొటే,  మురళీమనోహర్, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ,  పద్మజాషా, తెలంగాణ విద్యాకమిషన్ సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్ రావు, చారుకొండ వెంకటేశ్ తదితరులు మాట్లాడారు. 

ఇది వర్సిటీలపై దాడి: ఆకునూరి మురళి

గత పదేండ్ల కాలంలో రాజ్యాంగబద్ధ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఎలక్షన్ కమిషన్, ఐటీని కేంద్రం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నదో చూస్తూనే ఉన్నామని విద్యా కమిషన్​చైర్మన్​ఆకునూరి మురళి అన్నారు. తాజాగా యూజీసీని కూడా రాజకీయంగా ఉపయోగించుకునేలా చూస్తున్నదని, వర్సిటీల్లో వారి ఐడియాలజీని ఫాస్ట్‎గా ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం యూజీసీ ద్వారా వర్సిటీలపై దాడి చేస్తున్నదని చెప్పారు. కాగా, యూజీసీ గైడ్ లైన్స్‎ను వ్యతిరేకిస్తూ సదస్సులో తీర్మానం చేయగా, అందరూ మద్దతు ప్రకటించారు.