- 55 శాతంతో ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులకు అక్కర్లేదు
- యూజీసీ కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్ర మంత్రి ప్రధాన్
న్యూఢిల్లీ: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో ఫ్యాకల్టీ నియామకాలు, ప్రమోషన్ల కోసం కనీస విద్యార్హతలకు సవరణలు ప్రతిపాదిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కొత్త ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ ప్రతిపాదనలపై విద్యారంగ నిపుణుల సలహాలు, సూచనలు కోరుతున్నట్లు యూజీసీ పేర్కొంది.
ప్రస్తుతం అమలులో ఉన్న 2018 నాటి రూల్స్ ప్రకారం.. పీజీ అనంతరం అదే సబ్జెక్ట్‌లో నెట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అర్హులు. తాజాగా ప్రతిపాదించిన సవరణల ప్రకారం.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అందరికీ నెట్ తప్పనిసరి కాదు.
కనీసం 55 శాతం మార్కులతో ఎంఈ, ఎంటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు నెట్ క్వాలిఫై కావాల్సిన అవసరం లేదు. దీంతోపాటు కనీసం 75 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ (ఎన్సీఆర్ఎఫ్ లెవెల్ 6) లేదా 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (ఎన్సీఆర్ఎఫ్ లెవెల్ 6.5) , పీహెచ్డీ డిగ్రీ (ఎన్సీఆర్ఎఫ్ లెవెల్ 8) చేసిన వారికి నెట్‌నుంచి మినహాయింపు కల్పిస్తూ యూజీసీ ప్రతిపాదనలు చేసింది.
కొత్త నిబంధనల్లో వైస్ ఛాన్సలర్ల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. దీని ప్రకారం.. విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, పబ్లిక్ పాలసీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రీలకు చెందిన నిపుణులను కూడా వీసీలుగా నియమించడానికి అవకాశం ఉంటుంది.
ఇకపై 'ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్' పథకం కింద పరిశ్రమలో పనిచేసే వారిని కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించుకోవచ్చు. అలాగే...ఇకపై అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ (ఏపీఐ) పాయింట్ల ఆధారంగా ప్రమోషన్ ఉండవు. తమ ముసాయిదా నిబంధనలపై ఫిబ్రవరి 5లోగా అభిప్రాయాన్ని
సమర్పించాల్సిందిగా యూజీసీ కోరింది.