
భారత రాజ్యాంగంలో సమాఖ్య, ఏకరాజ్యం అనే పదాలను ఉపయోగించలేదు. మన దేశాన్ని 'రాష్ట్రాల కలయిక'గా అభివర్ణించారు. అయినప్పటికీ సమాఖ్య ప్రధాన లక్షణమైన అధికార విభజన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగింది. మనాన్ని అనుసరించి కేంద్ర జాబితాలోని కేంద్రానికి, రాష్ట్రాల జాబితాలోని రాష్ట్రాలకు చట్టాలు చేయడానికి అధికారం ఉంది.
ఉమ్మడి జాబితాలో సూచించిన సూచనల చట్టాలు అధికార కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నా ఈ అంశాలలో తుది నిర్ణయం కేంద్రానిది. 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ అమలులోకి రాకముందు విద్య రాష్ట్ర జాబితాలోని అంశం. 42వ రాజ్యాంగ సవరణ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చింది.
ఫలితంగా విద్యపై పెత్తనం చేసే అధికారం కొంత కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయింది. యూజీసీ ఇటీవల రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉప కులపతుల నియామకం అంశం, ఉన్నత విద్యకు సంబంధించిన కొన్ని నూతన ప్రతిపాదనలు చేసింది.
ప్రస్తుతం అమలులో ఉన్న ఉప కులపతుల నియామకాల ప్రకారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఉప కులపతుల నియామకం కోసం ఒక సెర్చ్ కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీ సూచించిన మూడు పేర్లను ఆ రాష్ట్రంలోని కులపతి అయిన గవర్నర్‌కు పంపుతుంది. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి తుదిపేరును ఎంపిక చేస్తారు.
రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే ఈ ప్రక్రియ అంతా సజావుగా జరిగిపోతుంది. విశ్వవిద్యాలయాల ఉప కులపతుల నియామక ప్రక్రియ ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఆ వ్యక్తి పీహెచ్‌డీ చేసి ఉండాలి. పదేళ్లు ఆచార్యునిగా ( ప్రొఫెసర్) పనిచేసి ఉండాలి.
గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పింగళి జగన్మోహన్ రెడ్డి 1975వ సంవత్సరంలో ఉప కులపతిగా నియమించడం ఆయన విశ్వవిద్యాలయాన్ని గదిలో పెట్టడం జరిగింది. 1982-–86లో సయ్యద్ హశిమ్ అలీని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా నియమించడం జరిగింది.
ఆయన మాజీ ఐఏఎస్ అధికారి. ప్రతిపాదిత నూతన యూజీసీ చట్టం ప్రకారం ఇకపై ఉప కులపతులుగా పరిశ్రమల అధిపతులను, ప్రభుత్వ ఉద్యోగాలను, బయటి వ్యక్తులను నియమించవచ్చు. ప్రస్తుతం ఉప కులపతుల పదవీకాలం మూడు సంవత్సరాలు ఉండగా, దీన్ని ఐదు సంవత్సరాలకు పెంచాలని నూతన యూజీసీ ప్రతిపాదనను సూచిస్తోంది. నూతన ప్రతిపాదనల ప్రకారం రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉప కులపతుల నియామకం విషయంలో అధికారం రాష్ట్ర గవర్నర్ చేతిలోకి వెళ్లిపోతుంది.
యూనివర్సిటీల నిర్వహణకు రాష్ట్ర నిధులు
కులపతుల సెర్చ్ కమిటీలో ఛాన్సలర్ (సర్వ సాధారణంగా రాష్ట్ర గవర్నర్), యూజీసీ చైర్మన్, విశ్వవిద్యాలయ సిండికెట్ లేదా సెనెట్ సభ్యులు ఉంటారు. ప్రస్తుత సెర్చ్ కమిటీల నియామకంలో పాత్రను పోషిస్తున్న రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు ఇకపై ఈ ప్రక్రియలో ఏ రకమైన పాత్ర ఉండదు.
రాష్ట్ర ప్రభుత్వాలు అనేక వ్యయ ప్రయాసల కోర్చి అవసరాలను గుణంగా ఆ రాష్ట్రంలో నూతన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఇంతచేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉప కులపతులను నియమించాలని ప్రతిపాదించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.
పేద విద్యార్థులపై భారం
యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ప్రతిపాదన ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో 3,000 మంది విద్యార్థులు ఉంటేనే గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుందని, ఉన్నత స్థాయి స్థాయి సంపాదించలేని విశ్వవిద్యాలయాలకు ప్రోత్సాహకాలు ఉండవనే ప్రతిపాదన సరైనది కాదు. ఈ అంశం ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు మేలు కలిగిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి కోర్సుల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదనను పరిశీలించాలి. ఈ ప్రతిపాదన అమలైతే చాలామంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు దూరమయ్యే అవకాశం ఉంది. ప్రతిపాదిత యూజీసీ చట్టం ప్రకారం ఆన్‌లైన్ కరెస్పాండెంట్ కోర్సులకు అనుమతులు ఇవ్వరాదని కేంద్రం ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. దీని వలన లక్షల మంది విద్యార్థులకు నష్టం కలుగుతోంది.
నూతన ప్రతిపాదనలపై వ్యతిరేకత
యూజీసీ ప్రతిపాదించిన నూతన ప్రతిపాదనలను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడులో అధికారంలో ఉన్న స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తమిళనాడు శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. ఈ సవరణల ప్రతిపాదనల అనంతరం బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖ మంత్రుల సమావేశం కర్ణాటకలో జరిగింది.
ఈ సమావేశంలో కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల విద్యామంత్రులు వారి ప్రతినిధులు. ఈ సమావేశంలో యూజీసీ రెగ్యులేషన్స్ 2020 లో 15 అంశాలను వ్యతిరేకిస్తూ అమలు చేయకూడదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కోరుతూ తీర్మానాన్ని ఆయనకు పంపడం జరిగింది.
ఇటీవల కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశం ఈ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ప్రతిపాదనలు సహకార సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం అని ఈ సమావేశం అభిప్రాయపడింది. ప్రజల ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను కాదని కేంద్ర ప్రభుత్వం చేత నియమితులైన గవర్నర్లకు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉప కులపతుల నియామకాన్ని అప్పచెప్పడం సమంజసం కాదు.
ఇది అప్రజాస్వామిక చర్య అవుతుంది. కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రుల లేదా విద్యాశాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలి. విస్తృత చర్చల అనంతరం ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వం ఒక ఆమోదయోగ్యమైన సమాధానం కనిపిస్తుందని ఆశిద్దాం.
- డా. పి. మోహన్ రావు, ప్రొఫెసర్ (రిటైర్డ్)-